ఓటయితే ఎయ్యరాదే..! | Eyyarade otayite ..! | Sakshi
Sakshi News home page

ఓటయితే ఎయ్యరాదే..!

Published Sun, Mar 16 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

ఓటయితే ఎయ్యరాదే..!

ఓటయితే ఎయ్యరాదే..!

 నాయకుడు : ‘తాత మన వార్డు కౌన్సిలర్ సీటు ఆడోళ్లకచ్చిందే. నా భార్యను నిలబెట్టిన. ఏట్లైన మనమే గెలుస్తమన్న నమ్మకముందే. ఎందుకైన మంచిదని ముందగల్లా మన అనుకున్నోళ్లను కలుస్తున్న. మన గల్లీల ఏఇంట్లో ఎంతమంది ఉన్నరో.. ఓళ్లకు ఎంజెప్తే సమజైతదో నీ పక్కా ఎరుక్కుంటదని అచ్చిన్నే.

మన గల్లీలో రచ్చబండ పెట్టినప్పుడు ముసలోలందరిని కూడగట్టుకుని ఫించన్లు కావాలే.. అని లొల్లి పెట్టి, అచ్చిన ఆఫీసర్లను పరేషాన్ జేసినవ్ గదనే. మీ లొల్లికి బుగులు పడి ఫించన్ రానోళ్లందరి అప్లికేషన్‌లు తీసుకున్నరు.

 తాత : అవ్ బిడ్డ మంచి ముచ్చట యాదిజేసినవ్. నాఅసుంటి ముసలోల్లు పాపం పించిన్లు రాక,అరిగోసపడుతున్నరు. గల్లీల మీటింగ్‌లు పెట్టినప్పుడల్లా అప్లికేసన్లు ఇచ్చుడుకే సరిపోయింది. పించిన్లు రాలేదు. మీటింగులల్లా 65 ఏళ్ల నిండి గరీబోళ్లందరికి ఫించన్లు ఇస్తమని, దరఖాస్తుపెట్టుకొమ్మని లీడర్లు, ఆఫీసర్లు చెబితే నమ్మి ఆశపడ్డం. పెద్ద లీడర్లు చెబుతున్నరు నిజంగా ఇత్తరేమోనని కూడబెట్టుకున్న పైసలు ఖర్సుబెట్టి ఫొటువోలు దిగి, అప్లికేసను పెట్టుకున్నం. ఆడికెళ్లి పించిన్ కోసం తిరగనిగడప, మొక్కని కాళ్లు లేవు బిడ్డ. ఎవరికి కనికరం రాలేదాయె. దేవుడా నీవె దిక్కని దినాలు ఎల్లదీస్తున్నం.

ఎవరిని అడిగిన.. ఇగో అస్తయ్ అగో అస్తయ్ అంటున్నరు. ఇప్పుడేమో ఎలచ్చన్లు అచ్చినయ్, అయ్యిపోయేదాక రావంటున్నరు. మళ్లీ ఓట్లడుగ అస్తర గదా బిడ్డ అప్పుడు శెప్తామని ఎదురుచూస్తున్నం. నాయకుడు: తాతా ఇగో గా పార్టీ రాజుగాడు గట్లనే జెప్పి అందర్ని పరేషాన్ జేసిండు. ఇగ రందిపెట్టుకోకు. ఈ ఎలచ్చన్ల నా భార్యను గెలుపిస్తే, గల్లీల ఇంటింటికి తిరిగి ముసలోల్లందరి పేర్లు రాసుకుని, అల్లకు పించిన్లు ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకముంచే.. నేన్ జూస్కుంట. మీకందరికి పించిన్లు ఇప్పించే జిమ్మెదారి నాది, ఏం ఫికర్ జేయకు.

 తాత: పోయిన ఎలచ్చన్ల కౌన్సిలర్‌గా గెలిసిన రాజుగాడూ.. ఓట్ల ముందు గివే మాటలు జెప్పిండు.. మరి గెలిసినంక అడిగితే. తాత నాచేతుల ఏముంది, సర్కారోళ్లు ఇస్తేనే గదా అన్నడు. మల్ల మల్ల అడిగితే కోపమైతుండని, ఇడసబెట్టేసినం. పించిన్లు, ఇల్ల జాగలు , రేషన్‌కార్డులు, ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తమని మస్తు మాటలు జెప్పిండు. కడుపు కాలేటోళ్లకు రాలేదు. పెద్ద లీడర్లు చెప్పినోళ్లకొచ్చినయ్. ముచ్చట్లపడి అసలు మాట మరిసిపోయిన బిడ్డ.. ఓట్లల్ల నువ్వే నిలబడుతున్న అంటివి గదా?
 

నాయకుడు : అవ్ తాత.. నేనే పోటీ చేద్దామనుకుని, యాడాది సంది గల్లీలదిరుగుతున్న. అందరి కాడి కెళ్లి చెప్పిన. అందరు మంచ్చిగన్నరు. గని ఏంజేద్దాం. నా అదృష్టం బాగ లేదేమో. మన గల్లీ సీటు ఆడోల్లకు అచ్చింది. ఆడోళ్లను ఇంటి బయటకు తెచ్చుడెందుకని సప్పుడు సెయకుండా ఉన్నుంటి. ఓ పార్టీవోల్లు మేమే ఖర్సుపెడుతం పోటీ చేయమని కబురు పంపిండ్రి. జర ఇంట్ల అరుసుకుంటని జెప్పిన, టైం లేదు.. ఎనకముందు సూడకు మేమున్నం గదా అన్నరు ఆ పార్టీవోళ్లు. గంతే పెళ్లాంను ఎంట దీస్కుని పోయి నామినేషన్ ఏసొచ్చిన.

 తాత : అవ్ బిడ్డ.. నీ భార్య ఓట్లల్ల గెలిస్తే గల్లీల్ల తిరగాలే. మీటింగులకు పోవాలే. గల్లీలో మంచి చెడ్డ ఏం జరిగిన ముందుగల్ల నిలబడాలే. ఎవరికి ఏమాపత్ అచ్చిన సూడాలే. నీకేమో పెద్దగా కూడవెట్టినై లేకపాయే. ఉన్న రెండెకరాల ఎవుసం చేసుకుని బతకాలే. పెళ్లాం నువ్వు చెరొక పని చేసుకుంటే మంచిగా బతకొచ్చు గదా. గీ ఓట్లల్ల నిలబడితే నీకేమోస్తదంటవ్. ఎలచ్చన్లంటే వట్టిది కాదు. లచ్చలు ఖర్సు పెట్టాలే. పార్టీలోల్లు ఎంతిస్తరు బిడ్డ. బాకీ చేసుకుని పరేషాన్ గాకు. ఒకయాల నీ పెళ్లాం గెలిచిందనుకో.. ఇంట్లో పని వోళ్లు జేస్తరంటవ్. నీ కిద్దరు పిల్లలున్నరు గదా. పొద్దుగల్లానే ఆళ్లని తయారుజేసి బడికి పంపాలే. గిట్ల మస్తు పనులుంటయ్.
 

నాయకుడు: నువ్ జెప్పింది సైయే తాత. నా పెళ్లాం గెలిస్తే యాడికిబోదు. నేనే అన్నీ జూస్కుంట. మూడు నెలకొపారి మున్సిపాలిటిల మీటింగ్ ఉంటదట. దానికి బోతే సరిపాయే. గల్లీల దిరిగేదిముంటది. ఎవుసం చేసుకుంటా అంతా నేనే చూస్తా.
 

తాత: ఇంతకి మన గల్లీల ఎంతమంది పోటీ జేస్తుండ్రు. పెద్ద లీడర్ల సుట్టాలు ఏవరైన ఉన్నరా? పోయిన ఎలచ్చన్ల గెలినోళ్లు, గెలువ నోళ్లు, పక్క గల్లీల నుంచి వచ్చినోళ్లు పోటీ జేస్తుండ్రని విన్న బిడ్డ నిజమేనా? పెద్ద లీడర్లు గల్లీల్ల పెచారంకు అస్తరటని గూ విన్న బిడ్డ..
 నాయకుడు: అవ్ తాత.. మస్తుమంది నామినేషన్లు ఏసిండ్రు. రెండు రోజుల దాకా పోటీల ఎవరుంటరో దెల్వదు. ముందగల్ల నా సంగంతి సూడరాదే. పెద్ద,సిన్న లీడర్ల ముచ్చట మనకేందుకే తాత.

 తాత: గిప్పుడు అసలు ముచ్చట కాడికి అచ్చినవ్. మన గల్లీలో ఏళ్ల కిందట కట్టిన మోరీలు కూలీపోయినయ్, గలీజు నీళ్లు రోడ్లమీదకొచ్చి కంపు ఆసనోస్తుంది, ఆనకాలంలా సంటి పోరగాండ్లకు రోగాలొచ్చి దవాఖానకు పాలైండ్రు. మన గల్లీ పక్కపొంటి పారుతున్న చెరువు కాల్వలో మేము సిన్నప్పుడు ఈతకొట్టినం, నీళ్తు ఎప్పుడు తాజాగా ఉండేయి. ఇప్పుడేమో మోరీల నీళ్లు కలిసి కంపు ఆసనొస్తుంది. పెద్దలీడర్లు గల్లీల్ల ఓట్లడుగ అస్తే అల్ల సంగతి అరుసుకుందామని జూస్తున్నా.

 నాయకుడు : ఇగో తాత గా పెద్దలీడర్లను ఏమన్న అడుక్కో.. ఏమన్న జేస్కో.. గని నా మాట యాదికుంచుకో. జర మనోళ్ల ఓట్లన్నీ  మనకే ఏసేటట్లు సూడే. గా పక్క గంగన్న తాత దగ్గరికి గూడ పోయి ఓ మాటజెప్పెస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement