* బిల్ట్ కార్మికులను రాజధానికి వెళ్లకుండా నిలిపివేసినఖాకీలు
* రాత్రి ఒంటి గంట వరకు రోడ్డుపైనే కార్మికులు
కమలాపురం : బిల్ట్ పరిశ్రమ మూతపడకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు బయల్దేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు బయల్దేరిన తమను పోలీసులు అడ్డుకోవడమేమిటని కార్మికులు మండిపడ్డారు. ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కమలాపురం నుంచి కార్మికులు హైదరాబాద్ వెళ్లేందుకు 5 బస్సులను అద్దెకు మాట్లాడగా.. మంగళవారం రాత్రి 10 గంటలకు బస్సులు కమలాపురం చేరుకున్నాయి.
కార్మికులు రాత్రి బస్సు ఎక్కి బయల్దేరుతున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చి బస్సులకు అడ్డం తిరిగి నిలిపివేశారు. దీంతో నాయకులు కార్మికులు అవాక్కయ్యారు. బస్సులు వెళ్లేందుకు అనుమతి లేదని, వెంటనే ఇక్కడి నుంచి కార్మికులు వెళ్లిపోవాలని మంగపేట ఎస్సై ముష్కం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా కార్మిక సంఘాల నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్‌కు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో బస్సులు ఖాళీగా తిరిగి వెళ్లిపోగా కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిది నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఎన్నుకుంటే నాయకులు నట్టేట ముంచారని పలువురు ఆరోపించారు. అసెంబ్లీ చర్చల్లో ఖాయిలాపడుతున్న పరిశ్రమలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చర్చిస్తుంటే.. బిల్ట్‌పై మాత్రం జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న తమపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరికాదని వాపోయూరు. పోలీసు నిర్బంధం ప్రయోగించడంలో యూజమాన్యం హస్తం ఉందని కూడా మండిపడ్డారు. ఇందుకు స్థానికంగా ఉన్న కొందరు బిల్ట్ అధికారులను వాడుకుంటోందని ఆరోపించారు.
‘చలో హైదరాబాద్’కు పోలీసుల బ్రేక్
Published Thu, Nov 20 2014 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement