సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజుల క్రితం రైల్వే విజిలెన్స్ అధికారులు హబ్సిగూడలోని ఒక ఏజెంట్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అందులో పట్టుబడిన రైల్వే టిక్కెట్‌లు చూసి అధికారులే విస్తుపోయారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన టికెట్‌లను, వాటితో పాటు కంప్యూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఏజెంట్ బినామీ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఒక్క హబ్సిగూడకు చెందిన ఏజెంట్ మాత్రమే కాదు... నగరంలోని వేలాది మంది రైల్వే టికెట్ ఏజెంట్‌లు ఇదే తరహా దందా నిర్వహిస్తున్నారు. ఆర్‌పీఎఫ్ పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిర్వహించే తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయి. అక్రమ దందాను అరికట్టేందుకు ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకపోవడంతో ఏటా కోట్లాది రూపాయాల ప్రయాణికుల సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు ప్రతిఏటా దక్షిణమధ్య రైల్వే నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాలు ఒక తంతుగానే మారుతున్నాయి.
ఏ టు జడ్ ఐడీలు...
దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు లక్ష టికెట్‌లను విక్రయిస్తారు. వీటిలో 40వేల టికెట్‌లు రైల్వే స్టేషన్‌లలోని బుకింగ్ కౌంటర్‌ల నుంచి విక్రయిస్తుండగా... 60వేల టికెట్‌లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ సొంత ఐడీలపైన ఈ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఆధార్‌తో పాటు నమోదైన ఐడీపైన 12 టికెట్‌లు, సాధారణ ఐడీలపైన 6టికెట్ల వరకు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు వెసులుబాటు ఉంది. అలాగే నామమాత్రపు చార్జీలతో ఏజెంట్‌ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. తత్కాల్ టికెట్‌లను బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు ఉదయం 10గంటలకే అనుమతి లభిస్తుండగా, ఏజెంట్‌లకు మాత్రం అరగంట ఆలస్యంగా ఉదయం 10:30గంటలకు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఏజెంట్‌లు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఏజెంట్‌గా నమోదు చేసుకొని ఐఆర్‌సీటీసీ నుంచి పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లపైన సాధారణ ప్రయాణికులుగా నమోదు చేసుకున్న ఐడెంటిటీలపై తత్కాల్ టికెట్‌లను కొల్లగొడుతున్నారు.
వాటిని ప్రయాణికులకు రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. రిజర్వేషన్‌లలోనూ ఇదే తరహా బినామీ దందా కొనసాగుతోంది. ‘ఇందుకోసం ఏ నుంచి జడ్ వరకు ఉన్న 26 అక్షరాలపై రకరకాల ఐడీలను సృష్టిస్తారు. ఈ ఐడీలపైనే పెద్ద ఎత్తున టికెట్‌లు బుక్ చేస్తారు. ఒకే కంప్యూటర్ నుంచి ఈ రకమైన బినామీ ఐడీలు వందల కొద్దీ నమోదై ఉంటాయి’ అని దక్షిణమధ్య రైల్వే విజిలెన్స్ అధికారి ఒకరు ‘సాక్షి’తో విస్మయం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఏజెంట్‌ల అక్రమ దందా భారీ ఎత్తున కొనసాగుతోందని చెప్పారు. పండగలు, వరుస సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లను రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ చార్జీ రూ.450 వరకు ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఏజెంట్‌లు రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు అంచనా. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా కోట్లాది రూపాయాల అక్రమ దందా కొనసాగుతోంది.
చర్యలు శూన్యం...
నకిలీ ఐడీలపై బల్క్‌గా టికెట్‌లను బుక్ చేస్తూ ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడడమే కాకుండా... రైల్వేను సైతం పెద్ద ఎత్తున మోసం చేస్తోన్న ఏజెంట్‌ల అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలు మొక్కుబడిగానే ఉన్నాయి. ఏటా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా దాడులు చేసి కేసులు నమోదు చేయడం మినహా ఈ అక్రమ దందాను అరికట్టలేకపోతున్నారు.
ప్రతి రోజు వెబ్‌సైట్ నుంచి బుక్ అయ్యే టికెట్‌లు ఏ సిస్టమ్ నుంచి బుక్ అవుతున్నాయనేది నమోదవుతుంది. సాధారణ ప్రయాణికులైతే ఏ నెలకో, ఆరు నెలలకో ఒకసారి తమ అవసరాల మేరకు టికెట్‌లను బుక్ చేసుకుంటారు. ప్రయాణకులు ఏ కంఫ్యూటర్ నుంచి ఎన్ని టికెట్‌లు బుక్ చేసుకున్నదీ తెలిసిపోతుంది. అదే విధంగా ఏజెంట్‌లు ఒకే కంప్యూటర్ నుంచి ప్రతిరోజు రకరకాల ఐడీలపైన టికెట్‌లు బుక్ చేస్తున్నప్పుడు కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ 143 ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ ఆర్‌పీఎఫ్, విజిలెన్స్ అధికారులు నిర్వహించే మొక్కుబడి దాడుల కారణంగా ఏజెంట్‌ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment