
సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ల కోసం ఎక్కడైనా రైతులు క్యూలు కడుతుంటారు. కానీ, వాటికోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలిరావడం విశేషం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పోచారం నుంచి పైరవీ లేఖలతో వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్‌ను కలవడానికి వస్తున్నారు. రోజుకు ఐదారుగురు వరకు ప్రజాప్రతినిధులు వస్తున్నట్లు అ«ధికారులు చెబుతున్నారు. కొందరైతే ఫోన్లుచేసి విన్నవిస్తున్నారు. పైగా ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ట్రాక్టర్ల కేటాయింపు మరింత ఊపందుకుంది. దీంతో ప్రజాప్రతినిధుల తాకిడి ఎక్కువైంది. ఒకవేళ కమిషనర్ అందుబాటులో లేకుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి సిఫార్సు లేఖలను అందజేస్తున్నారు. దీంతో వ్యవసాయాధికారులకు ఇదో పెద్ద పనిగా మారింది. అయితే నిబంధనల ప్రకారం కలెక్టర్లకే వదిలేయకుండా స్పెషల్ రిజర్వు కోటా అంటూ మంత్రి విచక్షణ మేరకు వ్యవసాయ శాఖ కూడా మంజూరు చేసేలా కోటా పెట్టడంతో పైరవీలు జోరందుకున్నాయి.
భారీ డిమాండ్‌తో...
వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను సరఫరా చేస్తుంది. ఒకేసారి గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుం ది. సగం అంతకుమించి భారీ సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో డిమాండ్ ఏర్పడింది. రైతులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్‌ల బృందం పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నవాటిని అర్హతగా గుర్తిస్తారు.
అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయ శాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను రూపొందిస్తుంది. దాని ప్రకారం రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలి. కానీ ఈ తంతు కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రత్యేక కోటా పెట్టడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు అందడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే ట్రాక్టర్లను ఎగరేసుకుపోతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని కొందరు కిందిస్థాయి రాజకీయ నేతలు కమీషన్లు పుచ్చుకొని సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అమ్మేస్తున్నార న్న విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రం ఎదురుచూపే మిగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment