యాచారం: రుణమాఫీ వర్తించని రైతులతో యాచారం తహసీల్దార్ కార్యాలయం శుక్రవారం దద్దరిల్లింది. 2010లో మండల పరిధిలోని మాల్‌లో అప్పటి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రీ షెడ్యూల్ చే యడంతో పాటు టర్మ్ లోను ఇచ్చినట్లు రికార్డులు మార్చాడు. దీంతో బ్యాంకు పరిధిలో ఉన్న నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది.తమకు న్యాయం చేయాలంటూ రైతులు వారం రోజులు గా ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు మాఫీ రైతుల లిస్టును గ్రామాల్లో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన వివిధ గ్రామాల బాధిత రైతులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎంపీపీ రమావత్ జ్యోతి శ్రీనివాస్ నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరిపల్లి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీ అరవింద్‌నాయక్ తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆం దోళన సాయంత్రం 4 గంటల దాకా కొ నసాగింది. తహసీల్దార్ వసంతకుమారి విషయాన్ని ఉన్నతాధికారులకు ఫోను ద్వారా సమాచారం అందించారు. వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ విజయకుమార్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులు 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిం చారు.
అప్పట్లో మేనేజర్ 409 మందికి రుణాలు రీ షెడ్యూల్ చేయడంతో టర్మ్ లోను కింద మార్చినట్లు, అందులో 250 మందికి పైగా రైతులకు సమాచారం తెలియకుండానే సంతకాలు పెట్టినట్లు ఉందని ప్రస్తుత బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు మేనేజర్ తప్పిదం వల్లే రైతులకు మాఫీ వర్తించకుండా పోతోందని, రైతులకు న్యాయం చేసే వరకు రుణమాఫీ పైనల్ లిస్టును ప్రకటించవద్దని ఎంపీపీ, జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని జేడీఏ విజయకుమార్ ఇచ్చిన హామీతో రైతులు తమ ఆందోళన విరమించారు.
న్యాయం చేయండి
Published Fri, Sep 5 2014 11:57 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement