క‘న్నీటి’ వర్షం | farmers got loss due to untimely rains | Sakshi
Sakshi News home page

క‘న్నీటి’ వర్షం

Published Wed, May 28 2014 1:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

farmers got loss due to untimely rains

ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ :  నెల వ్యవధిలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలకు వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో మే 4, 9, 11, 19, 21 తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు పంటలు నేలపాలయ్యాయి. దాదాపు 20 మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాల్లో నువ్వు, 100 ఎకరాల్లో పసుపు, 130 ఎకరాల్లో సజ్జ, ఇతర పంటలు కోత దశలోనే నీటిపాలయ్యాయి.

 అపార నష్టం..
 జిల్లాలోని సారంగాపూర్, జన్నారం, దండేపెల్లి, వేమనపల్లి, నెన్నెల, చెన్నూర్, జైపూర్, నిర్మల్, నిల్వాయ్, బెజ్జూర్, కోటపల్లి, భీమిని, దహెగాం మండలాల్లో వరి ధాన్యం కొనులగోలు కేంద్రాలకు తీసుకురాగా అకాల వర్షాలకు తడిసిపోయింది. సుమారు రూ.రెండున్నర కోట్ల నష్టం వాటిల్లింది. పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేక సగం వరకు ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో రబీలో 48 వేల ఎకరాల్లో వరి సాగుచేయగా అధికారులు 75 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆశించినంత ధాన్యం కేంద్రాలకు రాలేదు. పంట పొలాల్లోనే నూర్పిడికి సిద్ధంగా ఉన్న చేలు వడగళ్ల వాన కు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే వేళ ప్రకృతి ప్రకోపం ఓ వైపు.. అధికారుల అలసత్వం మరోవైపు రైతులను నిండా ముంచాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల కొరత తదితర సమస్యలతో కేంద్రాల వద్దే రోజుల తరబడి పడిగాపులు పడ్డారు. ఇదే క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. అతిగా తడిసిన చోట మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్‌లో అకాల వర్షాలకు 50ఎకరాల్లో పసుపు పంట పొలాల్లోనే నీట మునిగింది. దహెగాం మండలంలో 65 ఎకరాల్లో మిర్చి పంట పాడైంది. సారంగాపూర్, దిలావర్‌పూర్‌లలో సజ్జపంట నేలకొరిగింది.   

 నేల రాలిన మామిడి..
 మొదట్లో మామడి పూత అధికంగా పూయగా రైతులు ఆనందంగా ఉన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటకు తీవ్ర నష్టం జరిగింది. చెన్నూర్, మందమర్రి, జైపూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి, భీమిని, తాంసి, దండేల్లి మండలాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైపూర్ మండలంలో 2,500 ఎకరాల్లో మామిడి కాత రాలింది. దీంతో 190 టన్నుల వరకు కాయలు రాలి రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు.

తాంసి మండలం జామిడి, వడ్డాడి, నిపాని, కరంజీ(పి), పొన్నారి, ఈదుల్లావర్‌గావ్, గొట్కూరి, కప్పర్ల తదితర గ్రామాల్లో సుమారు 450 ఎకరాల్లో సాగవుతున్న జొన్న, నువ్వు , మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. కోతకోసి ఆరబె ట్టిన నువ్వు, జొన్న పంటలు తడిసి పోయాయి. వేమనపల్లి మండలంలో ఈనెల 20న కురిసిన వడగళ్ల వర్షానికి 200 ఎకరాల్లో మామిడి పంట నేలరాలి రూ.25 లక్షల నష్టం వాటిల్లిట్లు రైతులు తెలిపారు. మంచిర్యాల, దండేపెల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మామడ మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసింది.  

 రైతులను ఆదుకోని అధికారులు..
 రైతులు వేల ఎకరాల్లో పంటనష్టపోగా వ్యవసాయ అధికారులు నష్టం వివరాలను తక్కు వ చూపుతున్నారు. కేవలం 333 ఎకరాల్లో వరి, 87 ఎకరాల్లో నువ్వు, 20 ఎకరాల్లో మొ క్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంటున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించి రైతుల నష్టపోయిన వివరాలు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారుల దగ్గర లేవు. వారు కొనుగోలు చే సిన ధాన్యం తడవగా వాటి వివరాలు మాత్రమే చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement