కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అనుచరులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు చెరకు రైతులపై చేసిన దాడికి నిరసనగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు.
కోరుట్ల (కరీంనగర్ జిల్లా) : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అనుచరులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు చెరకు రైతులపై చేసిన దాడికి నిరసనగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైమాస్ లైట్లను ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు శనివారం రాత్రి పైడిమడుగు గ్రామానికి చేరుకున్నారు. కాగా అదే సమయంలో చెరకు రైతులు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో అమ్మిన చెరకు పాత బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
దీంతో ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపై దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఎమ్మెల్యే కాన్వాయిని అక్కడి నుంచి పంపించారు. కాగా మనస్తాపం చెందిన చెరకు రైతులు గ్రామంలో ఆదివారం ధర్నాకు దిగారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు రైతుల పట్ల ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.