సాగు, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో వ్యవసాయం, ఉపాధి రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జెడ్పీ హాల్‌లో శనివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సంబురాలకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ పాలనలో లోటుపాట్లు ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
జేఏసీ నేతలు ఆత్మన్యూనతకు గురికావద్దని, ఎవరికీ తలవంచి అడుక్కోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. పోరాటాలతోనే జేఏసీకి ప్రజలు అసామాన్య గుర్తింపు ఇచ్చారని, ఇప్పుడు వారి పక్షాన్నే నిలబడి పోరాడాలని సూచించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోదండరాం అభిప్రాయపడ్డారు.
స్వరాష్ట్ర పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని, ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదన్నారు. వ్యవసాయం, ఉపాధి అంశాలపై లోతైన అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలన, వన రులు అందరికీ సమానంగా దక్కే పరిస్థితి రావాలని కోదండరాం సూచించారు.
‘మిషన్ కాకతీయ’ లోటుపాట్లపై అధ్యయనం..
‘మిషన్ కాకతీయ’ అవసరమని, అయితే చెరువుల్లోని మట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. చెరువుల పునరుద్ధరణలోని లోటుపాట్లపై అధ్యయనం చేసి ప్రభుత్వం వద్ద ఉంచుదామన్నారు. ప్రజా సమస్యలపై జేఏసీ ఆధ్వర్యం లో ఇకపై ఉధృతంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, నాయకులు కె.కృష్ణకుమార్, అనంతయ్యతో పాటు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.