ఫీజుల పథకానికి మార్గదర్శకాలు రెడీ!
డిప్యూటీ సీఎం కడియం నేతృత్వంలో సిద్ధమైన గైడ్‌లైన్స్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కొత్త మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి. ఈ విద్యాసంవత్సరం (2015-16)లో నూతన గైడ్‌లైన్స్‌తో ఫీజుల పథకాన్ని అమలుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉన్నందున ఆ లోగానే వీటిని విడుదల చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది.
కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ కసరత్తును పూర్తిచేసి ఆయా నిబంధనలను రూపొందించింది.
ఐదువేల ర్యాంకులపైన పర్సంటేజ్
ఐదు వేల కంటే అధిక ర్యాంకు వచ్చేవారికి ఫీజు చెల్లించే విషయంలో కోర్సుల వారీగా నిర్ణీత కనీస మొత్తాన్ని (మినిమమ్ ఫీజు) చెల్లించడమా? ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సంటేజీ ఫీజును చెల్లించడమా? అన్న కోణంలో ఈ కమిటీ కసరత్తు చేసింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నిర్థారించిన ప్రకారం ఒక కాలేజీలో రూ. లక్ష ఉంటే.. మరో కాలేజీలో రూ. 25 వేలే ఉంది.
ఈ పరిస్థితుల్లో కనీస కోర్సులో కనీస ఫీజు (మినిమమ్) చెల్లించడం కంటే ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సెంటేజీ ఫీజునే ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యార్థుల స్థానికత నిర్థారణకు మాత్రం రాజ్యాంగంలోని 371-డీ ప్రకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతినెలా విద్యార్థుల అటెండెన్స్ పరిశీలన
ప్రతినెలా తప్పనిసరిగా విద్యార్థుల అటెండెన్స్‌ను పంపితేనే స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని భావిస్తోంది. వీరి అటెండెన్స్ 75 శాతానికి తగ్గకుండా ఉంటే... ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలోనే నేరుగా ఆ డబ్బును జమచేయాలని, ఇతర విద్యార్థులకు ఆయా కాలేజీల అకౌంట్లకు డబ్బు పంపించాలనే ఆలోచనతో ఉంది. ఎంసెట్‌లో 5వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది(ఉమ్మడి రాష్ట్రంలో పదివేల ర్యాంకు వరకు ఉండేది). కోర్సుల వారీగా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించే ఫీజులపై సీలింగ్ విధించాలని భావిస్తోంది.