‘కామారెడ్డి’ కోసం కొట్లాడుదాం
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజిస్తే కామారెడ్డికేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనోద్యమ స్ఫూర్తితో జిల్లా ఏర్పాటు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిం చారు. టీ జేఏసీ డివి జన్ కన్వీనర్ జి.జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సత్తా, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు టీటీఎఫ్, టీఎల్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు పలు తీర్మాణాలు చేశారు. కామారెడ్డిని మెదక్‌లో కలుపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మాణించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా సాధన కోసం ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల భాగస్వామ్యంతో సాధన సమితి పోరాడుతుందన్నారు. తొలిదశలో ఆర్డీఓ, కలెక్టర్, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించడం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం చేపట్టాలని తీర్మాణించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితో
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాను సాధించేందుకు ముందుకు సాగుదాం. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిని చైతన్యపర్చడం, ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తూ ఒత్తిడి తేవడం, చివరగా ఉద్యమానికి సన్నద్ధం కావడం ద్వారా జిల్లాను సాధించుకుందాం.
-జి.జగన్నాథం, జేఏసీ డివిజన్ కన్వీనర్
కొట్లాడి సాధించుకోవాలె
కామారెడ్డిని జిల్లా చేసుకోవడం కోసం జరిగే ప్రతీ ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుంది. జిల్లా కావడానికి అన్ని రకాలుగా కామారెడ్డి సౌలభ్యంగా ఉంది. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. జిల్లా సాధన కోసం జరిగే ఏ ఉద్యమంలోనైనా సంపూర్ణ సహకారంతో పాల్గొంటాం.
-బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు