
పోరు షురూ
శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది...
* పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
* ఈ నెల 19న నోటిఫికేషన్
* మార్చి 16న ఎన్నికలు, 19న ఫలితాలు
* ఓటు వేయనున్న 2,63,288 మంది..
* పోటీ పడుతున్న ఆశావహులు.. నేతలతో మంతనాలు
* జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను వెల్లడించింది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ స్థానంలో తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈనెల 19న నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. 2011 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి, ఇటీవల పేరు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు.
ఇప్పటివరకు పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా కపిలవాయి దిలీప్‌కుమార్ కొనసాగుతున్నారు. పట్టభద్రుల పోరుకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పలువురు నేతల్లో మళ్లీ రాజకీయ ఆశలు అలుముకున్నాయి. దీనికి తోడు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 80 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 500 మంది సిబ్బంది ఈ ఎన్నికలనిర్వహణలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మొదలైన రాజకీయం...
శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన అనేక మందిలో ఈ ఎన్నిక తిరిగి ఆశలు రేకెత్తిస్తోంది. జిల్లాలోని పలువురు ఆశావహులు పోటీకి సై అంటున్నారు. అయితే ఆయా పార్టీల టికెట్లు ఎవరికి వస్తాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు పలువురు పోటీపడుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ ఆశీస్సుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల ఆశవాహులు కూడా తమ అనుకూల నేతలను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారానికి దూరమైన కొందరు తీవ్ర స్థాయిలో నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
అమల్లోకి వచ్చిన కోడ్...
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజాప్రతినిధులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. కోడ్ ముగిసే వరకు అధికారిక కార్యక్రమాలు చేపట్టకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎలాంటి హమీలు ఇవ్వకూడదని ఈసీ ప్రకటించింది.
ఓటర్లు వీరే.....
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల్లో మూడు జిల్లాల నుంచి 2,63,288 మంది గ్రాడ్యుయేట్స్ ఓటుహక్కు విని యోగించుకోనున్నారు. వారిలో పురుష ఓటర్లు 1,93,360 మంది, మహిళా గ్రాడ్యుయేట్స్ 69,916 మంది, ఇతరులు 12 మంది ఉన్నారు.