టీఆర్‌ఎస్‌లో సంస్థాగత పోరు
గ్రామ కమిటీ ఎన్నికల్లో పోటాపోటీ
కొత్తవారికి, పాత వారికి మధ్య విభేదాలు
పలు గ్రామాల్లో రెండు కమిటీలు
డోర్నకల్‌లో ధర్నాకు దిగిన నాయకులు
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త పంచాయతీ మొదలైంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేస్తోంది. ఇన్నాళ్లు సర్దుకుని ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో పోటీ పడుతున్నారు. అధికార పార్టీ కావడంతో పోటీ ఎక్కువగా ఉంటోంది. ఇది సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది నియోజకవర్గస్థాయి నేతలు ఉన్న నియోజకవర్గాల్లో.. రెండు వర్గాల నేతల పోటీ తీవ్రంగా ఉంటోంది. ఫలితంగా కొన్ని గ్రామాల్లో రెండు కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇలా పోటాపోటీ కమిటీలతో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన సంస్థాగత ప్రక్రియ అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. చాలా మండలాల్లో నాయకుల పోటీ కారణంగా కమిటీల ఏర్పాటు ఏకాభిప్రాయం లేకుండానే జరుగుతోంది.
మాకు ఇంకేప్పుడు గుర్తింపు
2001లో ఏర్పాటైన టీఆర్‌ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది. పార్టీలో, ఉద్యమంలో మొదటి నుంచి పని చేసిన వారికి తోడు.. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని పార్టీల నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులకు, వీరికి మధ్య అవకాశాల కోసం పోటీ మొదలైంది. ఇన్నాళ్లు ఇది బయటపడలేదు. తాజాగా చేపట్టిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో పార్టీ పదవుల కోసం ఏకంగా నిరసనలు, ఘర్షణ వరకు దారితీస్తోంది. నియోజకవర్గస్థాయి నేతలు ఇతర పార్టీల వారు వచ్చి చేరిన నియోజకవర్గాల్లో.. మొదటి నుంచి పని చేసిన వారు ప్రస్తుతం అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు ఇప్పుడు పార్టీ పదవుల కోసం ప్రయత్నిస్తుండడంతో పాత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన తమకు గుర్తింపు వచ్చేది ఇంకెప్పుడు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ డోర్నకల్ నియోజకవర్గంలో క్లిష్టంగా మారింది. సాధారణ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన సత్యవతి రాథోడ్ ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన రెడ్యానాయక్ గెలిచి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. రెండు వర్గాలతో ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా రసవత్తరంగా సాగుతోంది. కురవి మండంలో కమిటీ ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు కమిటీలు ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అనుచరులు అడ్డుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెండు వర్గాల వారు సగం సగం చొప్పున గ్రామాలను పంచుకున్నట్లుగా కమిటీలను ఏర్పాటు చేశారు. డోర్నకల్ గ్రామానికి సంబంధించి రెండు కమిటీలను ప్రకటించారు. నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో సత్యవతి రాథోడ్ వర్గీయులు ఏకంగా రోడ్డుపై ధర్నా చేశారు. పార్టీకి సంబంధించిన విషయంలో రోడ్డుపై నిరసన తెలపడం విమర్శలకు దారి తీసింది. మొత్తంగా సత్యవతి రాథోడ్ వర్గీయుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చప్పగా సాగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు లేకపోవడంతో మండల స్థాయిలో పదవుల కోసం పెద్దగా పోటీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లోనూ ఇదే రకంగా ఉంది.
నియోజకవర్గంలో ఎన్నికల ముందు, ఆ తర్వాత.. ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పెద్దగా చేరకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
కమిటీల కొట్లాట
Published Fri, Apr 3 2015 12:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement