కాలం చెల్లినా బేఫికర్‌ | five members arrest in new registration for old vehicles | Sakshi
Sakshi News home page

కాలం చెల్లినా బేఫికర్‌

Published Thu, Mar 1 2018 8:05 AM | Last Updated on Thu, Mar 1 2018 8:05 AM

five members arrest in new registration for old vehicles - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్‌ఎక్స్‌ నుంచి కాలం చెల్లిన ఆక్షన్డ్‌ వాహనాలను ఖరీదు చేయడం... మెకానిక్‌ల సాయంతో వీటికి ఇంజన్, ఛాసిస్‌ నెంబర్లు వేయించడం... ఆర్టీఏ దళారులు, అధికారుల సాయంతో కొత్తగా ఆర్సీలు సృష్టించడం... వీటి సాయంతో వాహనాలను మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడం... 2015 నుంచి ఈ పంథాలో దందా చేస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒకరు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం దళారిగా డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆ విభాగానికి లేఖ రాయనున్నామన్నారు. 

ఉత్తరాదిలో వాహనాల వేలం..
గుజరాత్‌కు చెందిన యు.హితేష్‌ పటేల్‌ నగరానికి వలసవచ్చి మిఠాయిల వ్యాపారం చేసేవాడు. కవాడిగూడ, నాగోల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వీట్‌ షాప్‌లు నష్టాలు మిగల్చడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి కాలం చెల్లిన వాహనాలపై పడింది. ఉత్తరాదికి చెందిన పోలీసు విభాగాలతో పాటు ఆర్మీ సైతం 15 ఏళ్లకు మించిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తాయి. వీటి ఆర్సీలు ఇతర పత్రాలు ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్, ఛాసిస్‌ నెంబర్లు సైతం తుడిచేసి వేలంలో విక్రయిస్తారు. ఇలాంటి వాటిని ఉత్తరాదికి చెందిన  దళారులు పెద్ద మొత్తంలో ఖరీదు చేస్తారు. ఆపై వీటిని స్క్రాప్‌గా, విడి భాగాలు విక్రయించడానికి ఓఎల్‌ఎక్స్‌లో పెడుతున్నారు. 

వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసి నంబర్లు...
హితేష్‌ ఈ వాహనాలను ఓఎల్‌ఎక్స్‌ ద్వారా రూ.10 వేల నుంచి రూ.15 వేలు వెచ్చించి ఖరీదు చేస్తున్నాడు. వీటిని హైదరాబాద్‌కు తెప్పించిన తర్వాత తనకు పరిచయస్తులైన దాదాపు 20 మంది మెకానిక్‌లకు సమాచారం ఇచ్చేవాడు. యథాతథంగా వాహనం కావాలంటూ రూ.25 వేలకు విక్రయించేస్తున్నాడు. ఎవరైనా తమకు రిజిస్ట్రేషన్‌తో సహా కావాలని కోరితే అసలు కథ ప్రారంభిస్తున్నాడు. ఆర్టీఏ కార్యకలాపాలపై పట్టున్న హితేష్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సెర్చ్‌’ విభాగంలోకి ప్రవేశిస్తాడు. తమ దగ్గర ఉన్న వాహనం ఏ మోడల్‌కు చెందినదో గుర్తిస్తాడు. అప్పట్లో ఉండే రిజిస్ట్రేషన్‌ సిరీస్‌కు చెందిన ఏదో ఒక నెంబర్‌ అందులో ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేస్తాడు. ఆ నెంబర్‌ దాదాపు 15 ఏళ్లకు పూర్వానిది కావడంతో ‘నో డేటా ఫౌండ్‌’ అంటూ వస్తుంది. ఈ నెంబర్‌ నోట్‌ చేసుకునే హితేష్‌... మెకానిక్స్‌ సాయంతో ఆయా వాహనాలపై తనకు తోచిన ఇంజన్, ఛాసిస్‌ నెంబర్లను ప్రత్యేక ఉపకరణాల ద్వారా ముద్రించేస్తాడు.

ఆర్టీఏ దళారి సాయంతో...
ఇలా సిద్ధమైన వాహనాలకు సంబంధించిన నెంబర్లను ఓ చీటీపై రాసే హితేష్‌ దాన్ని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం ఏజెంట్‌ ఎ.విఠల్‌రావుకు అందిస్తాడు. ఒక్కో వాహనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసే విఠల్‌రావు ఈ వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారుల సాయంతో ఆర్సీలు జారీ చేయిచేస్తాడు. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే వాహనాలకు రీ–అసైన్‌మెంట్‌ పద్దతిలో, కాలం చెల్లినప్పటికీ ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాలకు రీ–రిజిస్ట్రేషన్‌ పద్దతిలో ఆర్టీఏ అధికారులు కొత్తగా వేరే నెంబర్లు లేదా పాత నెంబర్లు కేటాయిస్తారు. ఈ రెండు పద్దతుల్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న విఠల్‌రావు ఆర్సీలు జారీ చేయించి హితేష్‌కు అప్పగించేవాడు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీఏ కార్యాలయంలో తన పరిచయస్తులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తూ నకిలీ యజమానులుగా ప్రవేశపెడుతున్నాడు. వీరితోనే వేలిముద్రలు వేయించడం, ఫొటోలు దిగేలా చేయడం, డిజిటల్‌ సంతకాలు పెట్టించడం చేస్తున్నాడు. 

భారీ మొత్తాలకు అమ్మేసుకుంటూ...
ఇలా ‘తయారైన’ వాహనాలను హితేష్‌ తన ముఠాలోని మెకానిక్‌ల సాయంతో భారీ మొత్తాలకు విక్రయించేస్తున్నాడు. 1962 మోడల్‌కు చెందిన ‘ఏబీడీ 1’ రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాన్ని ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్మారు. విక్రయించేది సైతం మెకానిఖలే కావడం, వాహనాలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని ఉండటం, ఆర్టీఏ రికార్డుల్లోనూ వివరాలు ఉంటుండటంతో ఖరీదు చేసే వారికీ ఎలాంటి అనుమానాలు రావడం లేదు. మరోపక్క హితేష్, విఠల్‌రావు ఏలాంటి వాహనాలు లేకుండానే 14 ఆర్సీలు వివిధ పేర్లు, నెంబర్లతో జారీ చేయించి  సిద్ధంగా ఉంచారు. ఏవైనా వాహనాలు దొరికితే వాటిపై ఈ నెంబర్లు వేసి విక్రయించాలని భావించారు. మరోపక్క ‘వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సెర్చ్‌’ సహాయంతో 72 నెంబర్లను సిద్ధం చేసి ఉంచారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. 

క్రేజ్‌ ఉన్న వాహనాలే ఎక్కువగా...
ప్రధాన సూత్రధారి హితేష్, ఆర్టీఏ దళారి విఠల్‌రావులతో పాటు సహకరించిన మెకానిక్స్‌ మైఖేల్‌ మోది (ఆలుగడ్డబావి), హకీం అబు నాసిర్‌ (శాస్త్రిపురం), మహ్మద్‌ ఆరిఫ్‌లను (వారాసిగూడ) అరెస్టు చేసింది. వీరి నుంచి, వీరు విక్రయించిన 15 రాయల్‌ ఎన్‌ఫీల్డ్, 2 యమహా బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ గ్యాంగ్‌ ఎక్కువగా క్రేజ్‌ ఉన్న వాహనాలకే రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆర్టీఏ అధికారుల వివరాలు ఆరా తీయడానికి పోలీసు కమిషనర్‌ ద్వారా ఆర్టీఏ కమిషనర్‌కు లేఖ రాయనున్నామని డీసీపీ పేర్కొన్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం బోయిన్‌పల్లి, గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement