- మార్చి 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న ఇండిగో (6ఈ334) విమానం ఉదయం 10.40 గంటలకు టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెనుదిరిగి వచ్చింది.
- ఇదే నెలలో బ్యాంకాక్ నుంచి దుబాయ్ వెళ్లే ఏ–380 విమానాన్ని సాంకేతిక కారణాల వల్ల తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో అకస్మాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది.
- ఇక గత వారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో(7117) విమానం టైర్లు పేలిపోయి రన్‌వేపై నిలిచిపోయింది. దీంతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2.30 గంటల వరకు రన్‌వే మూసేశారు.
..ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి నెలా రెండు నుంచి మూడు విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిపోతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆగిపోతున్న ఫ్లైట్ల వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. విమానప్రయాణంలో అనిశ్చితి.. ఆకస్మాత్తుగా ఆగిపోతున్న విమానాలు.. తరచూ నిలిచిపోతున్న రన్‌వే సేవల కారణంగా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని విమాన సంస్థలకు చెందిన ఫ్లైట్లు పాతవి కావడం వల్లే ఈ తరహా సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రెండో రన్‌వే తెరుచుకొనేదెప్పుడో..!
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం 4.26 కిలోమీటర్ల పొడవైన ప్రైమ్ రన్‌వే నుంచే అన్ని విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రాత్రింబవళ్లు రన్‌వేపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. నిత్యం రాకపోకలు సాగించే విమానాల్లో నైట్ ఫ్లైట్సే ఎక్కువ. దీంతో రాత్రి పూట అకస్మాత్తుగా తలెత్తే సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క విమానం రన్‌వేపై నిలిచిపోయినా.. మొత్తం సర్వీసులపై దాని ప్రభావం ఉంటోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా విమానాశ్రయ విస్తరణలో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రెండో రన్‌వే నిర్మించారు. సాంకేతికంగా దీనికి అన్ని అనుమతులూ వచ్చాయి. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి లభిస్తే తప్ప ఈ రన్‌వే వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. గతేడాది నవంబర్‌లోనే డీజీసీఏ ఆమోదం లభిస్తుందని భావించినా.. ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. డీజీసీఏ అనుమతి లభిస్తే నైట్ ఫ్లైట్స్‌కు ఈ రన్‌వేను వినియోగించాలని జీఎంఆర్ భావిస్తోంది. ప్రైమ్ రన్‌వేపై ఓ విమానం ఆగిపోయినా మిగతా వాటి రాకపోకలకు రెండో దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ‘డీజీసీఏ నుంచి ఎంత త్వరగా అనుమతి లభిస్తే అంత త్వరగా రెండో రన్‌వే సేవలను ప్రారంభిస్తాం. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’అని శంషాబాద్ విమానాశ్రయ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వీలైనంత త్వరలోనే అనుమతి లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
– సాక్షి, హైదరాబాద్
ఒక రన్‌వే..470 విమానాలు..
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ఒక్క రన్‌వే నుంచే ప్రతి రోజూ సుమారు 470 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏ చిన్న సాంకేతిక కారణంతోనైనా ఒక విమానం రన్‌వేపై నిలిచిపోతే శంషాబాద్ రావలసిన మొత్తం విమానాలకు బ్రేక్ పడుతోంది. ఇటీవల ఇండిగో విమానం టైర్ పేలిన ఉదంతంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై విమానాశ్రయాల్లోనూ సర్వీసులకు అంతరాయం కలిగింది. మొత్తం 31 సర్వీసులకు బ్రేక్ పడింది. ఇందులో 10 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. మరికొన్ని సర్వీసులను మళ్లించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విమానాల్లో సాధారణంగా తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయే వాటితోనే ఇతర సర్వీసులకు బ్రేక్ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment