ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులు
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన చలి నగర ప్రజలను గజగజలాడిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల కంటే తగ్గిపోవడంతో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారింది. తల దాచుకునేందుకు నీడ లేక.. కప్పుకొనేందుకు సరైన దుప్పట్లు లేక రోడ్డు పక్కన, దుకాణాల అరుగులపై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరంలో తగినన్ని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్‌ఎంసీ ప్రకటనలు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జీహెచ్‌ఎంసీలో దాదాపు 200 నైట్ షెల్టర్లు అవసరముంది. కానీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది 12 షెల్టర్లు మాత్రమే. వాటిలో పరిస్థితుల çసంగతెలా ఉన్నా.. కనీస ఆశ్రయం లేక వేలాదిమంది రోడ్ల పక్కన, డివైడర్ల మీద, మూసివేసిన దుకాణాల షట్టర్ల వద్ద చలితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని రోగులకు సహాయకులుగా వచ్చినవారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఇలాంటి వారు అధికసంఖ్యలో ఉన్నారు. పటిపూట సైతం తీవ్ర చలి ఉండగా, రాత్రుళ్లు మరింత పెరుగుతుండడంతో వారు అల్లాడుతున్నారు.
అమలుకు నోచుకోని హామీలు
గ్రేటర్‌లో నైట్‌షెల్టర్ల సంఖ్యను పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్‌ఎంసీ చెబుతున్నా నేటికీ అమలు చేయలేదు. విశ్వనగరం పేరిట ఫ్లై ఓవర్లు వంటివి త్వరితంగా పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపుతున్న యంత్రాంగం.. అనాథలు, దీనులు, హీనులకు, ఆస్పత్రి అవసరాల కోసం వచ్చిన వారికి నీడనిచ్చే నైట్ షెల్టర్లపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు ఉన్న నైట్ షెల్టర్లనూ తగిన సదుపాయాలు లేక వాటిని వినియోగించుకునే వారు అతి తక్కువగా ఉంటున్నారు. ఉన్న షెల్టర్లలో కనీస సదుపాయాలు లేకపోవడం.. అవి అవరనానికి దూరంగా, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో ఉండడంతో అక్కడకు వెళ్లి ఉండేవారు కూడా తగ్గిపోతున్నారు. పైగా ఆయా షెల్టర్లలో తగిన పడకలు, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. వీటితోపాటు లాకర్ల సదుపాయి, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ ఇవేవీ లేక పోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు. ఎక్కువమంది ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలిలో కాలం వెళ్లదీస్తున్నారు.
తూతూమంత్రపు సర్వేలు
నిరాశ్రయులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు గతేడాది సర్వేలో చేపట్టారు. అందులో నగరంలో కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో 3,500 మంది ఉండగా, ఆ సంఖ్య çసగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ మంది నిరాశ్రయులు ఉండడాన్ని విశ్వసించని కేంద్ర బృందం మరోమారు సర్వే చేయాల్సిందిగా ఆదేశించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గ్రేటర్ అధికారుకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
నగరంలోని నైట్‌షెల్టర్లు..
బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ కాక జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 షెల్టర్లున్నాయి. వాటిలో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు చెబుతున్నా 200 మంది కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది తమ అవసరాల కోసం వచ్చిన ప్రాంతాల్లోనే చలిలో గడుపుతున్నారు. ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు నాలుగేళ్లక్రితం సర్వేలో గుర్తించిన అధికారులు ఆయా ప్రదేశాల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్‌టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, పేట్లబుర్జు, మహావీర్ ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. గాంధీ ఆస్పత్రి వద్ద స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ఆస్పత్రుల్లో మహావీర్, నిలోఫర్ వద్ద మాత్రం పూర్తికాగా, ఉస్మానియా, నిమ్స్, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రుల వద్ద త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అదికారులు చెబుతున్నారు.
నగరంలో నైట్ షెల్టర్లు ఉన్న ప్రాంతాలు,వాటి సామర్థ్యం ఇలా..
ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద 25
సరూర్‌నగర్ చౌడీ బిల్డింగ్ 20
పేట్లబుర్జు వార్డు కార్యాలయం 30
శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ 20
టప్పాచబుత్ర అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీహాల్ 50
గోల్నాక కమలానగర్ కమ్యూనిటీహాల్ 40
యూసుఫ్‌గూడ వార్డు కార్యాలయం 25
బేగంపేట ఫ్లై ఓవర్ కింద 45
శేరిలింగంపల్లి పాత మున్సిపల్ ఆఫీస్ 25
ఆర్‌కేపురం బ్రిడ్జి కింద 20
సికింద్రాబాద్ నామాలగుండు 30
బేగంపేట ఫ్లై ఓవర్ కింద (బ్రాహ్మణవాడి) 50
(ఉప్పల్, సరూర్‌నగర్, గోల్నాక, నామాలగుండు ప్రాంతాల్లో మహిళలకు కేటాయించగా, మిగతావి పురుషులకు కేటాయించారు)
Comments
Please login to add a commentAdd a comment