ఆస్తి కోసం ప్రాణాలు తోడేస్తున్నారు
- కుటుంబసభ్యుల ఉసురు తీస్తున్న కిరాతకులు
- నిన్న షాహినాయత్‌గంజ్.. నేడు బాలాపూర్
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి కోసం కుటుంబసభ్యుల ప్రాణాలను బలిగొంటున్నారు కొందరు దుర్మార్గులు...మొన్న నాగోల్‌లో భార్య, కొడుకుని కిరాయి హంతకులతో చంపించాడో వ్యక్తి. నిన్న..షాహినాయత్‌గంజ్‌లో కన్న తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు మరో కిరాతకుడు. నేడు... బాలాపూర్ సాయినగర్‌లో మరో ఉన్మాది భార్య, కూతరు, తల్లిని కిరాతంగా చంపాడు. రక్తబంధాన్ని మరిచి ఆస్తి కోసం ఇలా మారణ కాండకు పాల్పడటం సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. జంట కమిషనరేట్ల పరిధిలో ఏడాది కాలంగా ఆస్తి కోసం 30కి పైగా హత్యలు జరగడం కలకలం సృష్టిస్తోంది. యాదృశ్ఛికంగా కుటుంబ దినోత్సవం రోజున(శుక్రవారం) బాలాపూర్ సాయినగర్‌లో రాంరెడ్డి అనే ఉన్మాది భార్య రాధిక, తల్లి సుభద్ర, కూతురు అక్షయల గొంతు కోసి మారణకాండకు పాల్పడ్డాడు. వరుస ఘటనల నేపథ్యంలో నగరంలోని కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడు ఎవరు ఉన్మాదిగా మారతారోనన్న అభద్రతా భావంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఆస్తి కోసం గతంలో జరిగిన కొన్ని ఘాతుకాలు...
సెప్టెంబర్ 25, 2013: కేపీహెచ్‌బీకాలనీలో పీరమ్మ (55)ను దత్తపుత్రుడు ఠాకూర్‌పాషా స్నేహితులతో కలిసి గొంతునులిమి చంపేశాడు. సెప్టెంబర్ 31, 2013: అచ్చయ్యనగర్‌లో భార్య రజనిని భర్త బాలకృష్ణ కూల్‌డ్రిక్‌లో నిద్రమాత్రలు వేసి తాగించి కత్తితో గొంతులో పొడిచి కడతేర్చాడు. నవంబర్ 8, 2013: నాగోల్‌లో శశిధర్‌రెడ్డి అనే వ్యక్తి కిరాయి హంతకులతో భార్య విజయలక్ష్మిచ కొడుకు సాకేత్‌రెడ్డి చంపించాడు. సెప్టెంబర్ 1, 2014: తనకు తెలియకుండా రూ.30 వేలు బంధువులకు ఇచ్చిందని భార్య సబితను భర్త యాదగిరిరెడ్డి గొంతు నులిమి హతమార్చాడు.
నవంబర్ 20, 2014: సరూర్‌నగర్ హుటా కాంప్లెక్స్‌లో భార్య రేణుక (26) మెడకు బెల్ట్ బిగించి భర్త ప్రసాద్ చంపేశాడు. ఏప్రిల్ 20, 2014: ఉప్పల్‌లో మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును భర్త సచిన్ కొట్టి చంపాడు. నవంబర్ 21, 2014: బంజారాహిల్స్‌లో కుమారుడు అన్వర్‌బేగ్ తల్లి గౌస్యబేగం(60)ను చంపాడు. మార్చి 12, 2015.. షాయినాయత్‌గంజ్‌లో కొడుకు బాబు తల్లి లక్ష్మి (60)ని చంపి ఇంట్లోని పాతిపెట్టాడు.