
అడవుల్లో పోలీసులు--- పోలింగ్ వద్ద ఫారెస్ట్ సిబ్బంది
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
భద్రాచలం, న్యూస్‌లైన్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలను బహిష్కరించాలనే మావోయిస్టుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న అటవీప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. సీఆర్‌పీఎఫ్, ఎస్పీఎఫ్ ప్రత్యేక బలగాలతో పాటు అటవీ ప్రాంతంపై పట్టు ఉన్న పోలీసులతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవటంతో పోలింగ్ స్టేషన్‌లలో అటవీశాఖ సిబ్బందిని నియమించారు. డివిజన్‌లోని భద్రాచలం, చింతూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్‌లలో అటవీ సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా చింతూరు మండలంలోని పేగ, తుమ్మల పోలింగ్ స్టేషన్‌లలో అటవీ సిబ్బందికి తోడుగా మావోయిస్టు సానుభూతి పరులను సహాయకులుగా ఏర్పాటు చేయటం గమనార్హం.
మావోయిస్టు సానుభూతి పరులుగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన గిరిజనులను ఇందుకు ఉపయోగించారు. మావోయిస్టుల కదలికలపై వారికి తెలిసే అవకాశం ఉండటంతోనే సానుభూతి పరులను సహాయకులుగా వినియోగించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు.
అదే విధంగా చాలా పోలింగ్ స్టేషన్‌లలో అటవీశాఖ సిబ్బందినే భద్రత కోసం విధులను కేటాయించారు. అంతేకాకుండా ఆయా పోలింగ్ స్టేషన్‌లలో అటవీశాఖకు చెందిన సెక్షన్ అధికారి స్థాయి హోదాలో ఉన్న ఒక్క ఉద్యోగినే బందోబస్తు కోసం కేటాయించారు. కానీ ప్రత్యేక పారామిలటరీ, పోలీసు బలగాలను మాత్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్‌లకు సమీపంలో పెద్ద ఎత్తున మోహరింప జేశారు.
ఊపిరిపీల్చుకున్న అధికారులు :
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో జిల్లా అధికాయ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వటంతో పాటు గత కొన్ని రోజులుగా డివిజన్‌లోని పలు చోట్ల ఇదే విషయమై పోస్టర్‌లు, కరపత్రాలను వేశారు.
దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు ఎన్నికల నిర్వహణను సవాల్‌గా తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనులు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక దృష్టి సారించి ఏజెన్సీలోని ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. ఎన్నికలు ప్రశాతంగా ముగియటంతో పోలీసులతో పాటు, జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.