ఫారిన్‌ పండు.. భలేగుండు | Fruits Import From Foreign | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ పండు.. భలేగుండు

Published Thu, Apr 25 2019 7:38 AM | Last Updated on Sat, Apr 27 2019 11:57 AM

Fruits Import From Foreign - Sakshi

అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్‌ కివీ, వాషింగ్టన్‌ ఆపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌.. ఇలాంటి పండ్లు కావాలంటేఆ దేశాలకు వెళ్లనక్కరలేదు.ఏ దేశంలో పండే పండ్లయినా
 సరే నగర మార్కెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటి రుచిని ఆస్వాదించేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టే నగరంలో ప్రతి వేసవిలో విదేశీ పండ్ల వినియోగం భారీగా పెరిగుతోంది. హోల్‌సేల్‌ మార్కెట్, ఫుడ్‌ బజార్లు, పెద్ద వాణిజ్య కేంద్రాలు, సూపర్‌ మార్కెట్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగాప్రతి గల్లీలోనూ విదేశీ పండ్ల విక్రయించే చిల్లర వ్యాపారులుతెగ తిరుగుతున్నారు. ఈ తరహా పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని నమ్మేవారు పెరుగుతుండడంతో వీటి అమ్మకాలు సైతం ఊపందుకుంటున్నాయి.గతేడాది కంటే ఈసారి విదేశీ పండ్ల వ్యాపారం పెరగడమే ఇందుకు నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. 

20 దేశాల నుంచి దిగుమతి
ఇటీవల కాలంలో నగరానికి విదేశీ రకాల పండ్ల దగుమతులు భారీగా పెరిగాయి. రోజుకు 50 నుంచి 60 టన్నుల వరకు అన్ని రకాల పండ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని గడ్డిఅన్నారం మార్కెట్‌ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరం నుంచి ఈ పండ్లను పక్క రాష్ట్రాలు, జిల్లాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలోనే పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ విదేశీ పండ్లకు పెట్టింది పేరు. ఇక్కడికి దాదాపు 20 విదేశాల నుంచి వివిధ రకాల పండ్లు ఇక్కడి దిగుమతి అవుతున్నాయి. ఈ పండ్ల వినియోగంలో ముంబై, బెగళూరు తర్వాత నగరం దేశంలో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా పండే అన్ని రకాల పండ్లు నగర మార్కెట్‌లో సీజన్‌ ప్రకారం అందుబాటులో ఉండడం విశేషం. 

ఆన్‌లైన్‌లోనే బేరసారాలు..  
మార్కెట్‌ హోల్‌సెల్‌ వ్యాపారులు వివిధ దేశాల్లో లభించే పండ్లలను అక్కడి వ్యాపారులను ఆన్‌లైన్‌లో సంప్రదిస్తారు. వారివద్దనున్న పండ్లను వాట్సప్, మెయిల్‌లో ఫొటోలు పంపగా ధరలను నిర్ణయించుకుని ఆన్‌లైన్‌లోనే అడర్‌ చేస్తున్నారు. తర్వాత ఆయా దేశాల నుంచి పండ్లు చెన్నై, ముంబై ఓడ రేవులకు దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి నగరానికి కూల్‌ కంటైనర్లలో నగరానికి చేరుతున్నాయి.  

విదేశాల్లో కంటే ఇక్కడే ధర తక్కువ..  
విదేశీ పండ్ల ధరలు ఇక్కడే తక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఒక ఆపిల్‌ ఒకటి నుంచి రెండు డాలర్లు. అదే పండు మనకు రూ.30కి లభిస్తోంది. ఇలా విదేశాల నుంచి వచ్చే అన్ని పండ్లూ అక్కడి ధరల కంటే మనకే తక్కువకు లభిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. 

ఏ పండు ఎక్కడి నుంచంటే..
గ్రీన్‌ ఆపిల్‌.. నెదర్‌లాండ్స్, యూఎస్, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు నగర హోల్‌సెల్‌ వ్యాపారులు దిగుమతి చేసుకుంటన్నారు.  
ఆపిల్, రాయల్‌ ఆపిల్‌.. వాషింగ్‌టన్, చైనా, న్యూజిలాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబై, చెన్నై పోర్టుల ద్వారా నగరానికి దిగుమతి అవుతున్నాయి.  
కివీ.. న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తున్నాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్‌ ఉంది. 
ప్లమ్‌.. చూడ్డానికి చిన్న ఆపిల్, టమాటలా కనిపించే ఈ పండును స్పెయిన్‌ నుంచి వస్తుంది.  
డ్రాగన్‌ ఫ్రూట్‌.. వియత్నాం, థాయిలాండ్‌ దేశాల నుంచి వసుతంది.  
చెర్రీ.. నగరానికి దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడ ఒకటి. దీన్ని న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేస్తున్నారు.  
యాపిల్‌ రెడ్‌ గాలా.. ఫిజీ, ఫ్లేమ్‌ ద్రాక్ష.. ఆస్ట్రేలియా నుంచి.. ఈజిప్ట్‌ నుంచి పెద్ద సైజు నారింజ పండ్లు దిగుమతి అవుతున్నాయి.  

నగరంలో అధిక డిమాండ్‌ 
గతంలో పోలిస్తే విదేశీ పండు తినాలనే ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే ఆపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరిన్ని విదేశీ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు.    – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్‌ వ్యాపారి

దిగుమతులు పెరిగాయి
మార్కెట్‌కు గతంలో కంటే విదేశీ పండ్ల దిగుమతులు పెరిగాయి. వాటిని నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్‌ చాంబర్లు ఏర్పాటు చేశాం. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మార్కెట్‌ ఆదాయం కూడా పెరిగింది, గడ్డి అన్నారం మార్కెట్‌కే విదేశీ పండ్ల దిగుమతి జరుగుతోంది.     – ఈ. వెంకటేశం, గడ్డి అన్నారం మార్కెట్‌ కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement