
జన కెరటం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వచ్చిపోయే వాహనాలు... పుష్కర స్నానం చేసేందుకు దూర ప్రాం తాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు.. జిల్లాలోని పుష్కరఘాట్ల లో నెలకొన్న పరిస్థితి ఇదీ. శుక్రవారం సైతం లక్షలాది మంది భక్తులు 11 పుష్కరఘాట్లలో స్నానమాచరించారు. శనివారంతో పుష్కరాలు ముగియనుండడంతో వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచీ కుటుంబసమేతంగా భక్తులు వస్తున్నారు. చివరి రోజున ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం అన్ని పుష్కరఘాట్లలో తగిన ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపున మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జేసీ రవీందర్‌రెడ్డి శుక్రవారం వివిధ ఘాట్లను పరిశీలించి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు సైతం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భక్తజనం పోటెత్తుతున్న కందకుర్తి, తడపాకల్, పోచంపాడ్ సహా అన్ని పుష్కరఘాట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షిస్తున్నారు. పుష్కరఘాట్లలో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్యసేవలు, ఇతరత్ర కార్యక్రమాలు భక్తులకు అందుబాటులో కొనసాగుతున్నాయి.
పోచంపాడ్‌లో బారులు తీరి...
బాల్కొండ మండలం పోచంపాడ్ పుష్కరఘాట్‌లో భక్తుల కోలహలం కొనసాగింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చారు. దీంతో జాతీయ రహదారి, పోచంపాడ్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిపోయాయి. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే. శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ 4 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల రద్దీ పెరిగింది. పిండ ప్రదానాలు నిర్వహించి పితృ తర్పణాలు వదిలారు. భక్తులు అధికంగా రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. నిజమాబాద్ జిల్లాలో కోటికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
పులకించిన త్రివేణి సంగమం..
రెంజల్ మండలం కందకుర్తిలోని త్రివేణి సంగమం భక్తులతో పులకించిపోయింది. శుక్రవారం 3.35 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి సైతం భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లల్లో తరలి వచ్చారు. బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ దంపతులు గోదారమ్మ తల్లికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. కందకుర్తిని సందర్శించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లలితా సహస్రనామ పారాయణ శిబిరానికి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నదిలో పర్యటించి సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తులు...
పోచంపాడు, కందకుర్తి, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని, దోంచంద, గుమ్మిర్యాల్, సావెల్ సహా అన్ని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఏపీలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎస్సారెస్పీలో భక్తులు అధికం కావడంతో అధికారులు వారిని సావెల్ ఘాట్‌కు మళ్లించారు. నవీపేట మండలం తుంగిని ఘాట్‌లో శుక్రవారం 1.30 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు.
ఘాట్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లు, పోలీసులు, ఎన్‌సీసీ విద్యార్థులు, ఎస్‌పీవోలు అందుబాటులో ఉన్నారు. ఉమ్మెడలో 40 వేలకు పైగా భక్తుల పుణ్య స్నానాలు చేశారు. ఈ ఘాట్‌లో స్నానం చేయడానికి గుర్రంపై వచ్చిన భక్తుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే మహారాష్ట్రలోని పర్బనీ, నాందేడ్, ధర్మాబాద్, కిన్వర్ట్, బోకర్, ముదికేడు నుండి ఉమ్మెడ ఘాట్‌కు భక్తులు తరలివచ్చారు. కోస్లిలో సుమారు 16 వేలకుపైగా భక్తులు స్నానమాచరించారు.
పెరిగిన వీఐపీల తాకిడి...
మహా పుష్కరాల పదకొండో రోజూ వీఐపీల తాకిడి పెరిగింది. వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద పుష్కర స్నానం చేశారు. పిండ ప్రదానం అనంతరం స్థానిక శ్రీకోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోంచంద ఘాట్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్మ రవీందర్, పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మామిడి రవీంద్రనాథ్‌రెడ్డి దోంచందలో పుష్కర స్నానాలు ఆచరించారు.
నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖర్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రావణ్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి పుణ్య స్నానాలు చేశారు. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి పుష్కర స్నానం చేశారు.
ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లలో సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానమాచరించారు. కస్టమ్స్ కమిషనర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సారెస్పీలో పుష్కర స్నానం చేశారు. సినీ నటులు శ్రీధర్, నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్టీసీకి రూ.85 లక్షల ఆదాయం
నిజామాబాద్ నాగారం : గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 11వ రోజు శుక్రవారం ఆర్టీసీ 1079 ట్రిప్పుల బస్సులకుగాను 49,400 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. తద్వారా సంస్థకు సుమారు రూ.85 లక్షల ఆదాయం సమకూరింది.