
దుర్గం చెరువుపై పనులు జరుగుతున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : ఐటీ కారిడార్ ప్రాంగణంలో ఉన్న దుర్గం చెరువు నవరూపును సంతరించుకుంటోంది. ఓవైపు కేబుల్ బ్రిడ్జ్ పనులు సాగుతుండగానే.. మరోవైపు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్‌లు (ఎఫ్‌టీసీ) కూడా శరవేగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు చెరువు చుట్టూరా ఫన్, ఈట్, గేమ్ జోన్స్ ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ చెరువును వీక్షించేందుకు వచ్చే సందర్శకులకు వినోదం దగ్గరి నుంచి ఆహారం వరకు ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉండి వారిలో జోష్ నింపేలా అడుగులు వేస్తున్నారు. దుర్గం చెరువు వద్ద రూ.184 కోట్ల వ్యయంతో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు చెరువులో గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు ఎఫ్‌టీసీలు సైతం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ) పర్యవేక్షణ తరహాలోనే దుర్గం చెరువు డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ చెరువు చుట్టూరా ఉన్న దాదాపు 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించే విధంగా పనులు వేగిరం చేశారు.
బీపీపీఏ మాదిరిగానే..
బీపీపీఏ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కు, ఎన్‌టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను అభివృద్ధి చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూరా పచ్చదనం పెంపుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ ఏర్పాట్లతో పాటు ఆటవిడుపు కోసం ఆయా పార్కుల్లో గేమింగ్ జోన్ ఉండేలా చూసుకున్నారు. ఇదే తరహాలో దుర్గం చెరువును కూడా మార్చేలా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో దుర్గం చెరువు డెవలప్‌మెంట్ అథారిటీ త్వరలోనే ఏర్పాటుకానుంది. ఆ చెరువు చుట్టూరా 300 ఎకరాలను హెచ్‌ఎండీఏకు అప్పగిస్తే పూర్తి స్థాయిలో పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా అభివృద్ధి చేయనున్నారు. ఒకవేళ ఈ అథారిటీ ఆచరణ రూపంలోకి వస్తే 86 ఎకరాల్లో ఉన్న దుర్గం చెరువు టూరిస్ట్ హబ్‌గా మారనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు సేద తీరేందుకు ఇది సరైన ప్రాంతం కానుందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment