సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్‌జీఎఫ్) ప్రతి పాదనలు అటకెక్కాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల కోసం జిల్లా అధికార యంత్రాంగం గత నెలలో ఎంతో ఆర్భాటంగా.. ఆగమేఘాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ.. ఆ ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా ప్లానింగ్ కమిటీ (డీపీసీ) ఆమోదం తీసుకున్నాకే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అయితే.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఈ ప్లానింగ్ కమిటీ నియామకం ఊసే ఎత్తకపోవడంతో బీఆర్‌జీఎఫ్ నిధుల ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే మూలుగుతున్నాయి.
రూ.33.11 కోట్లతో ప్రతిపాదనలు..
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం స్థానిక సంస్థలకు ఏటా నిధులు విడుదల చేస్తుంది. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఈ నిధులు వస్తాయి. ఏటా సుమారు రూ.33 కోట్ల మేరకు ఈ నిధులు విడుదలవుతాయి. ఇందులో భాగంగా గత నెలలో ఆయా స్థానిక సంస్థలు ప్రతిపాదనలు తయారు చేశారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, సబ్‌సెంటర్ భవనాలు, తాగునీటి పథకాలు వంటి పనులు ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీల కాంపోనెంట్ కింద రూ.13.49 కోట్లు, మండల పరిషత్ కాంపోనెంట్‌లో రూ.8.09 కో ట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5.38 కోట్లు, ఏడు మున్సిపాలిటీల్లో 5.52 కోట్ల అంచ నా వ్యయం కలిగిన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీల ఆమోదం తీసుకున్నారు.
మండల పరిషత్, మున్సిపాలిటీల పనులకు సంబంధించి అప్పట్లో ప్రత్యేక అధికారుల ఆమోదంతో ప్రతిపాదనలు జిల్లా పరిషత్‌కు వచ్చాయి. అయితే.. ఈ ప్రతిపాదనలకు జిల్లా ప్లానింగ్ కమిటీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం ఈ ప్లానింగ్ కమిటీ ఊసే ఎత్తడం లేదు. కమిటీ నియామకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు గానీ, ఆదేశాలు కానీ విడుదల చేయకపోవడంతో కమిటీ నియామకం నిలిచిపోయింది. దీంతో ఈ బీఆర్‌జీఎఫ్ పనుల ప్రతిపాదనలు అటకెక్కినట్లయింది.
గతేడాది జిల్లాకు మొండిచేయి..
గతేడాది సకాలంలో ప్రతిపాదనలు పంపకపోవడం, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జిల్లాకు ఒక్కపైసా కూడా రాలేదు. సకాలంలో స్పందించి ఉంటే రూ.36.65 కోట్లు వచ్చేవి. ఫలితంగా ప్రతిపాదించిన సుమారు 3,784 పనులకు మోక్షం కలగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడిచిపోయినా నిధులకు సంబంధించి ఇంకా ప్రతిపాదనలే వెళ్లకపోవడంతో నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారింది.
ఇంకా ఆదేశాలు రాలేదు- అనితాగ్రేస్, జెడ్పీ సీఈవో
జిల్లా ప్రణాళిక కమిటీ నియామకం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. రెండు మూడు రోజుల్లో ఈ ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నాము. జీవో వచ్చిన వెంటనే డీపీసీని నియమించి బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపుతాము.
వెనుకబడిన నిధులు!
Published Mon, Aug 25 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement
Advertisement