హైదరాబాద్: పథకాలు బారెడు.. నిధులు మాత్రం మూరెడు అన్నట్లుగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం భారీ అంచనాలే వేసింది. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్రంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో పాటు, కేంద్ర పన్నుల వాటా ఆదాయం కూడా తగ్గిపోవడంతో సర్కారు నెత్తిన పిడుగుపడినట్లయింది. మొత్తంగా రూ. లక్ష కోట్లకు పైగా అంచనాలతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. మార్చి నెలాఖరుకు రాష్ట్ర ఆదాయ వ్యయాల మొత్తం రూ. 70 వేల కోట్లకు మించేలా కనిపించడం లేదు. దీంతో బడ్జెట్‌లో భారీగా కోతలు తప్పదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.
ఈ సారి బడ్జెట్‌పైనే..
రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఆసక్తి రేపుతోంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా ఎంచుకొని.. సంక్షేమమే ఎజెండాగా గత నవంబర్‌లో పది నెలల కాలానికి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐదు నెలల వ్యవధిలోనే రెండో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మరి ఈ సారి బడ్జెట్ ప్రజాకాంక్షలను ప్రతిబింబిస్తుందా, సరిపడేన్ని నిధులు కేటాయిస్తారా? అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిధుల సమీకరణ ప్రశ్నార్థకమే..
కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గటం, రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో నిధులు సమకూరని నేపథ్యంలో... దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల భారీ మొత్తం ఎలా సమకూరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో ప్రణాళికేతర వ్యయం పెరిగిపోతోంది. వేతన సవరణతో ఏటా రూ. 6,500 కోట్ల భారం పెరిగింది. ఇప్పటికే ప్రణాళికేతర వ్యయం ఏటా రూ. 50 వేల కోట్లు దాటింది. ఇంత ప్రణాళికేతర వ్యయా న్ని భరిస్తూ అభివృద్ధికి నిధులు సమకూర్చాలంటే.. ప్రభుత్వానికి కత్తిమీద సామే. తొలి ఏడాదే దాదాపు రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చిన సర్కారుకు... ఇక ముందు రుణాలు చేయడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది.
భారీ పథకాల పురోగతి..
రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రభుత్వం అమలు చేసింది. మొదటి విడతగా తొలి బడ్జెట్‌లో రూ. 4,250 కోట్లు ఇచ్చింది. మిగతా దాదాపు రూ. 12,750 కోట్లను మూడు విడతలుగా వచ్చే మూడేళ్లలో చెల్లిస్తామని ప్రకటించింది. ఇక ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని అందించేందుకు రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇందుకోసం తొలి ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటికీ నిధుల విడుదల లేదు. మరోవైపు చిన్నతరహా సాగునీటి చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. రాబోయే ఐదేళ్లలో రూ. 20 వేల కోట్ల అంచనాతో 46,447 చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇందులో గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయించింది. ఇంకా రూ.18,000 కోట్లు కావాలి.
డబుల్ బెడ్ కింద ఎన్ని ఇళ్లు..
గత ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. రూ. 3.50 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కారు... ఎన్ని ఇళ్లను నిర్మించాలి, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించాలనేది నిర్ణయించలేదు. పాత గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవినీతి, అవకతకల విచారణతో దీనికి ముడిపెట్టింది. సమగ్ర సర్వే ప్రకారం పది జిల్లాల పరిధిలో 14 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది.
జిల్లాకో లక్ష ఇళ్ల చొప్పున ఐదేళ్లలో పది లక్షల ఇళ్లు నిర్మించాలనేది సర్కారు ఆలోచన. ఈ లెక్కన రూ. 35,000 కోట్ల బడ్జెట్ అవసరం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 33 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 40,000 కోట్లు అవసరం. కొత్తగా రూ. 16,000 కోట్ల అంచనాతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు భారీగానే నిధుల అవసరముంది.
మొగ్గు దేనివైపు..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, రుణమాఫీ, ఎస్సీ, బీసీల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులెలా వస్తాయనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ పట్టాలెక్కని డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ, రహదారుల నిర్మాణానికి సర్కారు ఈ సారైనా మొగ్గు చూపుతుందా..? అనేదానిపై స్పష్టత లేదు. ఈ పథకాలన్నింటికీ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి పెట్టుకుంది. కానీ ఆరంభస్థాయిలోనే తొలి ఏడాది ముగిసింది. మిగతా నాలుగేళ్ల వ్యవధిలో ఈ పథకాలన్నీ సాకారం కావాలంటే.. ప్రభుత్వానికి కనీసం రూ. 2.50 లక్షల కోట్లు అవసరమవుతాయి.
మరింత సంక్షేమం..
రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు... రాబోయే ఐదేళ్లలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి రూ. 50 వేల కోట్లను వ్యయం చేస్తామని ప్రతిపాదించింది. కానీ అందులో తొలి ఏడాది ప్రకటించింది కేవలం రూ. 1,000 కోట్లు మాత్రమే. అంటే మరో రూ. 49 వేల కోట్లు కావాలి. ఇక రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీల అభివృద్ధికి రాబోయే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో తొలి ఏడాది రూ. 2,022 కోట్లు కేటాయించింది. ఇంకా భారీగా నిధులుకావాల్సి ఉంది.
ఇక వచ్చే రెండేళ్లలో రూ. 10 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ తొలి బడ్జెట్‌లో ఇచ్చింది కేవలం రూ. 400 కోట్లే. ఉచిత విద్యుత్, కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ. 4,500 కోట్లు ప్రతిపాదించారు. ఈ లెక్కన విడుదల చేసినా.. రాబోయే నాలుగేళ్లకు రూ. 18,000 కోట్లు అవసరం. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులకు ఇచ్చే పింఛన్లను రూ. వెయ్యికి పెంచటం, వికలాంగులకు రూ. 1,500 పింఛన్, బీడీ కార్మికులకు కూడా వర్తింపు వంటివాటితో పింఛన్ల కోసం ఏటా రూ.4000 కోట్లు అవసరం పడుతోంది. అంటే మిగతా నాలుగేళ్లలో అవసరమైనది ఏకంగా రూ. 16,000 కోట్లు.