కంప్యూటరీకరణకు కాసులేవీ..?
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణపై అధికారుల్లో అస్పష్టత నెలకొంది. 15 రోజుల్లో వివరాలన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాలని ఆదేశించి న ప్రభుత్వం.. అందుకు చెల్లించే సొమ్ముపై మా త్రం స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. పైకం చెల్లింపుపై స్పష్టత ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఈ నెల 19 సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది.
ఒకే రోజు సర్వేలో జిల్లాలో 8,40,971 కుటుంబాల వివరాలు సేకరించారు. 866 గ్రామపంచాయతీల్లో 6,83,556 కుటుంబాలు, ఏడు మున్సిపాలిటీల ప రిధిలోని 213 వార్డుల్లో గల 1,57,415 కుటుంబాల వివరాలు సర్వే ఫారాల్లో నమోదయ్యాయి. సర్వే శాతం 106.50గా నమోదైంది. నేడు లేదా రేపు ఈ సర్వే కంప్యూటరీకరణ పూర్తిస్థాయిలో ప్రారంభమ య్యే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,030 కంప్యూటర్లు ఈ వివరాలను నిక్షిప్తం చేసేందుకు ఉ పయోగిస్తున్నారు. ఇందుకు కార్యాలయాలు, భవనాలూ ఎంపికచేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
రొక్కం ఏదీ..?
సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లా స్థాయి పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ జగన్మోహన్ ఇప్పటికే స్పష్టం చేశా రు. ఒక్కో ఆపరేటర్ రోజూ 80-100 వరకు సర్వే ఫారాలు వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో కుటుంబం ఆధారంగా చెల్లిస్తారా లేదా రోజు వారి గౌరవ వేతనం ప్రకారం ఇస్తారా అనే విషయంపై మార్గదర్శకలేమీ రాలేదు.
దీనిపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏం చెప్పాలో తెలియక.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేక అధికారుల్లో గందరగోళం నెలకొంది. ‘ప్రస్తుతానికి కంప్యూటరీకరణ ప్రారంభించండి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆ మేరకు మీకు చెల్లిస్తాం’ అని అధికారులు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు భరోసా ఇస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో స్పష్టత వస్తే బాగుంటుందని అధికారులు, ఆపరేటర్లు భావిస్తున్నారు.