ఏదీ రైతుసేవ...? | gajwel Market yard in where farmar service | Sakshi
Sakshi News home page

ఏదీ రైతుసేవ...?

Published Tue, Jul 1 2014 12:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఏదీ రైతుసేవ...? - Sakshi

ఏదీ రైతుసేవ...?

- గజ్వేల్ మార్కెట్‌యార్డులో అక్రమార్కులదే రాజ్యం
- యార్డు ఆదాయానికి ఏటా లక్షల్లో గండి
- అభివృద్ధి పనుల పేరిట నిధుల దుర్వినియోగం
 గజ్వేల్: ఆదాయపరంగా జిల్లాలోనే రెండో స్థానాన్ని ఆక్రమించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్ యార్డుగా ఉన్న గజ్వేల్‌లో ‘రైతు సేవ’ ముసుగులో ఆక్రమాలకు తెర లేచింది. వ్యాపారుల మాయాజాలం కారణంగా ప్రతిఏటా మార్కెట్ యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. యార్డులోనే వ్యాపార లావాదేవీలన్నీ సాగాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. మరోపక్క అభివృద్ధి పేరిట జరుగుతున్న పనుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం.
 
గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్‌లో 19ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది.   ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్‌గా ఆవిర్భవించింది. రైతు సేవ కోసం నిర్మించిన ఈ యార్డు అక్రమాలకు నిలయంగా మారటం ఆందోళన కలిగిస్తోంది.
 
రైతుల అవతారంలో వ్యాపారులు
గజ్వేల్‌లో యార్డులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల పత్తిని బినామీ పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్‌లను సమర్పించి సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయించుకోవడం పరిపాటిగా మారింది..ఆపై ఎలాంటి లావాదేవీలు జరపనట్లుగా మార్కెట్ ఫీజు యథేఛ్చగా ఎగవేస్తున్నారు. ఫలితంగా యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది.

పత్తి దిగుబడులు రైతుల చేతికందే సీజన్‌లో ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేస్తారు. ఎప్పటిలాగే 2012 అక్టోబర్ 8న సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. కానీ ఏనాడు ఈ కేంద్రం సక్రమంగా లావాదేవీలను చేపట్టలేదు.  ఈ పరిస్థితిని అవకాశంగాా మలుచుకుంటున్న వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.3600నుంచి 3700వరకు ధర చెల్లించారు. 40కిలోల సంచిపై తరుగు పేరిట 2కిలోల వరకు కోత విధించారు.

ఈ విధంగా సేకరించిన వేలాది క్వింటాళ్ల పత్తిని తామే రైతులమని బినామీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించి రూ.3900క్వింటాల్ చొప్పున సీసీఐకి అమ్ముకున్నారు. ఆ నెలలో సీసీఐ ద్వారా 70వేల క్వింటాళ్లకు పైగా  కొనుగోళ్ల జరిగాయి. ఇందులో సుమారు 60వేలకుపైగా క్వింటాళ్లకుపైగా ప్రైవేట్ వ్యాపారులే విక్రయించగా. ఈ 60వేల క్వింటాళ్లు (ఒక్కో క్వింటాల్ ధర రూ.3900చొప్పున లెక్కిస్తే) తాము వ్యాపార లావాదేవీలు జరిపామని రికార్డులు చూపితే ఒక్కో క్వింటాల్‌కు ఒక శాతం చొప్పున సుమారు 23లక్షలకుపైగా మార్కెట్ ఫీజు చెల్లించాల్సివుండగా అది పూర్తిగా ఎగవేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ బయటపెట్టగా అధికారులు తూతూమంత్రంగా విచారణ చేపట్టి వదిలేశారు.
 
నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట
గత కొన్నేళ్లక్రితం వ్యాపారులకు చెందిన దుకాణాల ముందు భాగంలో నిర్మించిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది. ఈ పనులు చేపట్టే సందర్భంలో అధికారుల నుంచి సరైన పర్యవేక్షణ కొరవడటం కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సీసీ పూర్తిగా కంకర తేలి రైతులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తరుణంలో ఈ సీసీపైనే 4 ఇంచులు మందంతో కొత్తగా సీసీ వేశారు. 91మీటర్ల పొడవునా ఈ పనులు సాగాయి.

నిజానికి ముందుగా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందుగా 135మీటర్ల పొడవునా ఈ పనులు చేపట్టాలనుకొని , ఇందుకోసం రూ.35లక్షల వెచ్చించాలనుకొని ఆదరాబాదరాగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ శాఖ ఎస్‌ఈ యార్డును సందర్శించి 91మీటర్లు పనులు చేపడితే సరిపోతుందని సూచించడంతో ఈ పనులు అంచనా వ్యయం రూ.20లక్షలకే పరిమితమైంది. మిగిలిన రూ.15లక్షలతో ఓపెన్ ఫ్లాట్‌ఫారాల పక్కన కొత్తగా సీసీ రోడ్ల నిర్మించి వృథా ఖర్చును కొంతవరకు అరికట్టగలిగారు. ఏదీఏమైనా నాణ్యత లోపించిన పాత పనికి రూ.20లక్షలు వెచ్చించాల్సి వచ్చింది.
 
‘బహిరంగబేరం’ యథాతథం
యార్డులో మొత్తం 35కుపైగా ట్రేడింగ్ లైసైన్స్‌లుండగా యార్డులో కేవలం 10మంది వ్యాపారులకు మించి క్రయవిక్రయాలు జరపడంలేదు. గతేడాది కొన్ని నెలలు బహిరంగబేరం నిర్వహించకుండా హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోపోవడంతో మిగితాలెసైన్స్‌దారులు యార్డు పక్కనే తూప్రాన్ రోడ్డుపై సొంతమడిగెలు నిర్మించుకొని యథేచ్ఛగా ‘బహిరంగ బేరం’ నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement