
గ్యాస్ ట్యాంకర్ బీభత్సం...
- బైక్, కారు, రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసం
- కూలిన ప్రహరీ
- ఐదుగురికి గాయాలు
- స్తంభించిన ట్రాఫిక్
బాలానగర్: గ్యాస్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది... అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని, కారును, రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొని తర్వాత ఓ ప్రహరీని గుద్దుకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం కారణంగా సుమారు 5 గంటల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడుకు చెందిన ఎల్‌పీ గ్యాస్ ట్యాంకర్ (టీఎన్88ఏ 5706) జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వెళ్తోంది.
వేగంగా వెళ్తున్న ట్యాంకర్ నర్సాపూర్ చౌరస్తా చిత్తారమ్మ బస్తీ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద అదుపుతప్పి.. ముందు వెళ్తున్న యాక్టివా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ బండిపై వెళ్తున్న అశోక్‌పాండే కిందపడిపోయాడు. ట్యాంకర్ మరికాస్తా ముందుకు వెళ్లి ఒక కారుతో పాటు ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందుకు వెళ్లి రోడ్డుపై నిలిపి ఉన్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ఆ తర్వాత పక్కనే ఉన్న ఎన్‌ఆర్‌ఎస్‌సీ ప్రహరీ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రహరీ కూలిపోయింది. కాగా, ప్రమాదం జరిగినప్పడు బస్సు లో ఉన్న 20 మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్‌పాండేకు తీవ్రగాయాలు కావడం తో బాలానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్యాంకర్‌లో ఎల్‌పీ గ్యాస్ ఉందని, ప్రమాదం జరిగినప్పడు గ్యాస్ లీక్ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఐదు గంటలు ట్రాఫిక్ జామ్....
ఈ ప్రమాదం కారణంగా జీడిమెట్ల నుంచి బాలానగర్ వచ్చే వాహనాలు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రెండు ప్రొక్లైనర్లతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.