అశ్రునయనాలతో సోదరుల అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన సోదరుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య నిర్వహించారు.
► సైనిక లాంచనాలతో కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి దహన సంస్కారాలు
► హాజరైన వేలాది మంది ప్రజలు
► నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
కోదండరాంపురం (గరిడేపల్లి) :
కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన సోదరులు నలబోలు కృష్ణారెడ్డి, నలబోలు శేఖర్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం మండలంలోని కోదండరాంపురంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. దహన సంస్కారాలకు పలు గ్రామాల ప్రజలతో పాటు నాయకులు అధికారులు బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కృష్ణారెడ్డి, ఆర్మీ డాక్టర్‌గా శేఖర్‌రెడ్డి పనిచేస్తూ పెళ్లి చూపులకు వస్తూ మార్గమధ్యలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
తండోపతండాలుగా..
సోదరుల దహనసంస్కారాలకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల తల్లిదండ్రులు నలబోలు శేషిరెడ్డి–కమలమ్మలు విలపిస్తున్నతీరును చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. వీరి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, సాముల శివారెడ్డి, బొబ్బాభాగ్యరెడ్డి, పొలిశెట్టి అంజ య్య, ఎస్‌ఐ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏఎస్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, పయిడిమర్రి రంగనాథ్, మండవ నర్సయ్య, షేక్. యాకుబ్, కొత్త రామకృష్ణారెడ్డి, చిత్తలూరి సోమయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, త్రిపురం అంజన్‌రెడ్డితో పాటు పలువురు సందర్శించి నివాళులర్పించారు.
సైనిక లాంచనాలతో ..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలబోలు శేఖర్‌రెడ్డి భువనేశ్వర్ ఆర్మీ విభాగంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయన మృతికి ఆర్మీ అధికారులు సైనిక లాంచనాలతో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి, మృతదేహాలపై జాతీయ జెండాలను కప్పి నివాళులర్పించారు. తల్లిదండ్రులకు కృష్ణారెడ్డి,–కమలమ్మలకు జాతీయ జెండాను గుర్తుగా అందించారు. కార్యక్రమంలో కాంపోజిట్ ఆసుపత్రి హైదరాబాద్ డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ సురేంద్ర సంగోడి, ఎన్‌ఆర్‌డీఎఫ్ అసిస్టెంట్ కమాండెట్ జె. సెంతిల్‌కుమార్, జీఏడీ హెడ్‌కానిస్టేబుల్ కేజె రావు, గరిడేపల్లి ఎస్‌ఐ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏ ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డితో పాటు 9మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు.