అడుగడుగునా నిఘా | GHMC cc cameras in the workplace | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నిఘా

Published Thu, Jul 17 2014 4:16 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

అడుగడుగునా నిఘా - Sakshi

అడుగడుగునా నిఘా

  •      జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు
  •      పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అమలులో భాగంగా చర్యలు
  •      ఆగస్టు 15 నుంచి ఆచరణ
  •      బయోమెట్రిక్ హాజరు
  •      జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ గ్రీవెన్స్ డే
  •      నగదు రహిత వైద్య సదుపాయం
  • సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు, పార్కింగ్,  డంపింగ్ యార్డుల వద్ద వెబ్ అనుసంధాన సీసీ కెమెరాలు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం 32 ప్రాంతాల్లో వీటిని ఏరాటు చేయనున్నారు. ఈ కెమెరాల్లోని దృశ్యాలు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో పాటు పోలీసు శాఖకూ అందుబాటులో ఉంటాయి. కెమెరాల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పోలీసు కంట్రోల్ రూమ్ వీటిని పరిశీలిస్తుంది.

    జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు మొబైల్ ఫోన్లలో సైతం వీటిలోని దృశ్యాలు వీక్షించవచ్చు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అమలులో భాగంగా నగరంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల వద్ద వీటి ఏర్పాటుకు  జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నేరస్థులను గుర్తించేందుకే కాకుండా, పని వేళల్లో పదేపదే బయటకు వెళ్లే ఉద్యోగులపై నిఘాకు కూడా ఇవి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి దీనిపై కార్యాచరణకు దిగనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు చెప్పారు. వీటిలో నిక్షిప్తమయ్యే దృశ్యాలు కనీసం నెల రోజుల పాటు అందుబాటులో ఉంటాయన్నారు.
     
    వ్యాపార ప్రాంతాలు.. అపార్ట్‌మెంట్లలోనూ..

    జీహెచ్‌ఎంసీ కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లలో సైతం ఈ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. వ్యాపారులు ట్రేడ్ లెసైన్సులు పొందేటప్పుడే తమ షాపులోని దృశ్యాలను చిత్రీకరించేలా ఏర్పాటు చేసుకునే కెమెరాలతో పాటు, బయటి దృశ్యాలు చిత్రీకరించేలా మరో కెమెరాను అదనంగా ఏర్పాటు చేయాల్సిందిగా సూచించనున్నారు. మున్ముందు ఈ అంశాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. అపార్ట్‌మెంట్ పరిసరాలను చిత్రీకరించేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేముందు సంబంధిత వ్యక్తులకు సూచించనున్నారు.
     
    గుర్తింపు కార్డులు.. బయోమెట్రిక్ హాజరు
     
    జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులతో పాటు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయనున్నారు. వాహనాలన్నిటికీ జీపీఎస్ సిస్టమ్ అమలు చేయనున్నారు. యూనియన్ల విజ్ఞప్తి మేరకు డ్రైవర్లు, ఇతరత్రా సిబ్బంది, మహిళా ఉద్యోగులకు అవసరమైన లంచ్‌రూమ్‌లు, చేంజ్‌రూమ్‌లు, టాయ్‌లెట్ సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ చెప్పారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వంగా మెలగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనను పాటిస్తామని తెలిపారు.

    ప్రతి సోమవారం మధ్యాహ్నం 1-1.30 గంటల మధ్య అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల ఫిర్యాదు దినంగా పాటిస్తామన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను రాతపూర్వకంగా అందజేస్తే మరుసటి వారానికి పరిష్కరిస్తామన్నారు. పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు తెలుపుతూ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు తమ వేతనాలు, సెలవులు, ఇంక్రిమెంట్లు తదితర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు.
     
    వైద్య సదుపాయం
     
    జేబులో డబ్బు లేకున్నా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ తెలిపారు. దీని కోసంఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంటామని, జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల గుర్తింపు కార్డు చూపితే నగదు లేకున్నా వైద్య సేవలందించేలా ఈ విధానం అమలవుతుందన్నారు. తెల్లకార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులాగా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందన్నారు.
     
    దీర్ఘకాలంగా ఉన్న వారికి స్థాన చలనం
     
    జీహెచ్‌ఎంసీలో ఒకే చోట మూడేళ్లకు పైబడి పని చేస్తున్న వారిని బదిలీ చేయనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. కారుణ్య నియామకాలను చేపడతామన్నారు. వీటికి సంబంధించిన వారు తమను సంప్రదిస్తే వీలైనంత త్వరితంగా నియామకాలు పూర్తి చేస్తామని వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement