
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మిగిలింది కేవలం 30 రోజులే. ఇంకా వసూలు కావాల్సిన ఆస్తి పన్ను మాత్రం దాదాపు రూ. 405 కోట్లు. దీంతో రోజుకు రూ. 13.52 కోట్లకు తగ్గకుండా ఆస్తి పన్ను వసూలుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి దాకా స్వచ్ఛ మంత్రం పఠించిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగమంతా ఇక వసూళ్ల పర్వం లో మునగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) రూ. 1400 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యం కాగా, బుధవారం వరకు రూ. 994.40 కోట్లు వసూలయ్యాయి. మిగతా మొత్తాన్ని సేకరించేందుకు జోన్ల వారీగా లక్ష్యాన్ని నిర్ధారించారు.
జీహెచ్‌ఎంసీ డాకెట్లవారీగా బిల్ కలెక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించి, ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాల్సిందిగా కమిషనర్ డిప్యూటీ, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి దాదాపు రూ. 852 కోట్లు వసూలైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువే వసూలైనప్పటికీ, లక్ష్యాన్ని చేరుకునేం దుకు కసరత్తు చేపట్టారు. ఇప్పటి వరకు బిల్ కలెక్టర్ల ద్వారా దాదాపు రూ. 556 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రూ. 181 కోట్లు, మీసేవ కేంద్రాల ద్వారా రూ. 82.25 కోట్లు, ఆన్‌లైన్ ద్వారా రూ. 174 కోట్లు వసూలయ్యాయి. ఆస్తిపన్నుతో పాటు ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు కూడా వసూలు చేయా ల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఈ సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల లక్ష్యం రూ. 50 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ. 38 కోట్లు వసూలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment