డ్రోన్‌ మ్యాపింగ్‌ | GHMC Drone Maps Soon | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ మ్యాపింగ్‌

Published Tue, Jun 18 2019 12:07 PM | Last Updated on Mon, Jun 24 2019 11:46 AM

GHMC Drone Maps Soon - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని భవనాలు, రోడ్లు, నాలాలు, నీరు నిలిచే ప్రాంతాలు, చెత్తడబ్బాలు తదితర సమస్త వివరాల కోసం డ్రోన్ల ద్వారా జీఐఎస్‌ మ్యాపింగ్‌ సర్వే చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. చెన్నై తదితర నగరాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రక్రియ చేపట్టడంతో హైదరాబాద్‌లోనూ డ్రోన్ల ద్వారా ఈ సర్వే చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. త్వరితంగా సర్వే పూర్తయ్యేందుకు వీలుంటే ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా సర్వే చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాఫ్ట్‌కు  ప్రత్యేకంగా అమర్చే హై రిజల్యూషన్‌ కెమెరాల ద్వారా ఈ సర్వే చేయవచ్చునని సంబంధిత అధికారి తెలిపారు. అయితే సర్వే డ్రోన్ల ద్వారానా, లేక విమానాల ద్వారానే అనే అంశానికి  సంబంధించి రాష్ట్ర ఐటీ సర్వీసెస్, జేఎన్‌టీయూహెచ్, తదితర సంస్థలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, అందుకనుగుణంగా సర్వే చేపట్టనున్నారు. 

జీహెచ్‌ఎంసీలోని రోడ్లు, నాలాలు, చెరువులతో సహ ఇతరత్రా అన్ని యుటిలిటీస్‌కు సంబంధించిన వివరాలతో సిటీ బేస్‌ మ్యాప్‌ అంటూ ఉంటే ఏ రకంగానైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను పరిధిలో లేని భవనాలెన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఏయే భవనాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయో, ఎన్ని అంతస్తులు అదనంగా నిర్మించారో కూడా తెలుసుకునే వీలుంటుంది. తద్వారా అండర్‌ అసెస్డ్, అన్‌ అసెస్డ్‌ భవనాలకు సరైన ఆస్తిపన్నును నిర్ధారించడం ద్వారా జీహెచ్‌ఎంసీకి ఎంతో ఆదాయం పెరుగుతుంది. మానవ సర్వేలతోనే ఎలాంటి పన్ను పెంచకున్నా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే మొత్తం ఏటికేడు పెరుగుతోంది. ఇక ఈ ఏరియల్‌ సర్వేతో  ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏరియల్‌ సర్వేతో నగరానికి సమగ్ర బేస్‌మ్యాప్‌ రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారు. 

ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వేతో మేలు...  
డ్రోన్‌ సర్వే కంటే ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వే చేస్తే తక్కువ సమయంలోనే పూర్తవుతుందని, డ్రోన్‌ ద్వారా నెలల రోజుల సమయం పట్టేది విమానం ద్వారా అయితే రోజుల్లోనే పూర్తిచేయవచ్చునని సంబంధిత అధికారి పేర్కొన్నారు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వే చేయాలంటే  కేంద్ర రక్షణ, హోమ్‌ అఫైర్స్, సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వశాఖలతో పాటు ఇతరత్రా శాఖలు, రాష్ట్రప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఒక మీటరు పరిధి వరకు చిత్రాలు స్పష్టంగా ఉంటాయని, అదే డ్రోన్‌సర్వే ద్వారా 5 సెం.మీ.ల పరిధిలో కూడా హై రిజల్యూషన్‌ చిత్రాలు వస్తాయని ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వే ద్వారా అయితే 10 సెం.మీ. పరిధిలో కచ్చితమైన వివరాలుంటాయని పేర్కొన్నారు. ఒక భవనం లేదా ఏరియాకు సంబంధించి 3డి మోడల్‌తో కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు.  ఈ సర్వే పూర్తయితే చెరువులు, పార్కుస్థలాల వంటివాటి పరిరక్షణతోపాటు రోడ్లు, వరద కాలువలు, వీధి దీపాలు, ఫుట్‌పాత్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితరమైన వాటి వివరాలూ తెలుస్తాయని,  విపత్తు నిర్వహణకూ ఎంతో  ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని అన్ని ఆస్తుల(భవనాల) కార్పెట్‌ ఏరియా కూడా తెలిసే సదుపాయం ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement