సమావేశంలో మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ్లల్లోనూ చెత్త తొలగించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పలు అంశాలపై జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగా సాయంత్రాల్లోనూ చెత్త తరలింపునకు ఎన్ని అదనపు వాహనాలు అవసరమో అధ్యయనం చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5న నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితహారం, ఇంకుడు గుంతల తవ్వకం, ప్లాస్టిక్ నిషేధం అనే మూడు ప్రత్యేక అంశాలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరిగిందని, ఈ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరంలోని 150 వార్డుల్లో ప్రతి వార్డులోనూ కనీసం రెండు లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ప్రకటించారు. ఇందుకుగాను ప్రతి వార్డులో రోడ్ల విస్తీర్ణం, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల వివరాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, మొక్కల పంపిణీ వివరాల ప్రణాళికలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌లను రూపొందించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
గ్రేటర్ పరిధిలోని మెట్రో వాటర్ వర్క్స్‌కు చెందిన అన్ని కార్యాలయాలు, వాటర్ ట్యాంక్‌ల ప్రదేశాల్లో నర్సరీల పెంపకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సాహెబ్ నగర్‌లోని మెట్రో బోర్డు కార్యాలయంలో దాదాపు 40 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉందని, ఇదే విధమైన మెట్రో కార్యాలయాల ఖాళీ స్థలాల్లో వెంటనే నర్సరీల పెంపునకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ మొదటి లేదా రెండో వారం నుంచి నగరంలో సెల్లార్ల తవ్వకం పై నిషేధం విధించే అవకాశం ఉందన్నారు. నగరంలో గుర్తించిన పురాతన, శిథిల భవనాల కూల్చివేతపై సంబంధిత యజమానులకు తిరిగి నోటీసులు జారీ చేయాలన్నారు. నగరంలో రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా పునర్నిర్మించేందుకు చేపట్టిన పనుల్లో 6వేల మ్యాన్‌హోళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఆస్తిపన్ను సేకరణలో భాగంగా రూ. 1200 నుండి రూ.లక్ష లోపు ఆస్తిపన్ను చెల్లించే భవనాలను రీ–అసెస్‌మెంట్ చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు నానో మానిటరింగ్ వాహనాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. వివిధ అంశాలపై నగరవాసుల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిపై తాను ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జోనల్ కమిషనర్లతో నేరుగా సమావేశాలు నిర్వహించేందుకుగాను వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి కాటా, శృతిఓజా, అద్వైత్‌కుమార్‌సింగ్ సందీప్‌జా, సిక్తాపట్నాయక్, జయరాజ్ కెనెడి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, చీఫ్ ఇంజినీర్లు సురేష్, శ్రీధర్, జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment