సాక్షి, హైదరాబాద్: చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తన సోదరి మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న కేసులో శుక్రవారం ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెదక్‌లో తన సోదరి చనిపోతే బాన్సువాడ ఆస్పత్రిలో మరణించినట్లుగా అధికారులు ధ్రువపత్రం ఇచ్చారని మెదక్‌కు చెందిన జ్యోత్స్న కమలాదేవి పిటిషన్ దాఖలు చేశారు.
మృతురాలి భర్త అయిన తన బావ తప్పుడు ధ్రువీకరణపత్రాన్ని సృష్టించారని.. దీనిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఎలిజిబెత్ రాణి, గత మార్చి 11న ఉదయం గుండెపోటుతో మెదక్‌లో మరణించగా, రాణి భర్త హనుమాండ్లు ఆమె ఆస్తి కొట్టేసేందుకు బాన్సువాడ ఆస్పత్రిలో తప్పుడు మరణ ధ్రువీకరణపత్రాన్ని పొందారని పిటిషన్ తరఫు న్యాయవాది చెప్పారు.
అలాగే ఇందుకు సహకరించిన బాన్సువాడ ఆస్పత్రి వైద్యుడు, పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని వాదించారు. దీనిపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్పందిస్తూ.. వివరాలు సమర్పించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment