లక్ష కోట్లపైనే ఇచ్చాం
ఇదేమీ మామూలుగా చెప్పడం లేదు.. వివరాలతోనే వచ్చా... గత పాలకులు ఇచ్చిన నిధులను బీజేపీ ప్రభుత్వం అనేక రెట్లు పెంచింది: అమిత్ షా
► ఆ నిధులు పొందడం తెలంగాణ ప్రజల అధికారం
► బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర సత్వర ప్రగతి
► ‘హైదరాబాద్’ పోలింగ్ బూత్ కమిటీ భేటీలో కమల దళపతి
సాక్షి, హైదరాబాద్:
‘‘ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి అందిన చేయూత, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఈ మూడేళ్లలో కేంద్రం అందించిన సాయం ఏంటో తెలంగాణ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది. ఇది నేనేమీ మామూలుగా చెప్తున్న మాటలు కాదు. నా పర్యటనలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందే ఊహించి మొత్తం వివరాలతోనే వచ్చాను. ఇదేదో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఉదారత చూపి ఇస్తుంది కాదు.. ఆ నిధులు పొందే అధికారం తెలంగాణ ప్రజలకు ఉంది. వారి హక్కును కేంద్రం గౌరవిస్తోంది..’’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా 13వ ఆర్థిక సంఘం కింద కేంద్ర పన్నుల వాటా రూపంలో తెలంగాణకు రూ.9,795 కోట్లు అందగా.. దాన్ని పది రెట్లు పెంచుతూ 14వ ఆర్థిక సంఘం కింద మోదీ ప్రభుత్వం రూ.96,706 కోట్లు అందజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.2,110 కోట్లు ఇవ్వగా మోదీ ప్రభుత్వం 4.5 రెట్లు పెంచి రూ.9,900 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల గ్రాంట్ రూపంలో రూ.249 కోట్లు గతంలో అందగా.. మోదీ ప్రభుత్వం దాన్ని 33 రెట్లు పెంచి రూ.8,764 కోట్లు ఇచ్చిందన్నారు. వీటిని కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే కేటాయించిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ చేయూత కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలాంటి సంస్థల కేటాయింపును మరిచిపోవద్దని సూచించారు. బుధవారం రాత్రి హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మోదీకి దేశం అండగా ఉంది..
‘‘భారతదేశం శక్తిమంతమైంది. మంచి మానవ, సహజ వనరులున్నాయి. కానీ కాంగ్రెస్ పాలకులు వాటిని వినియోగించుకోలేక దేశం ముందుకు సాగలేదు. కనీసం ప్రజలకు ఇళ్లలో మరుగుడొడ్లు కూడా ఏర్పాటు చేయించలేని దౌర్భాగ్యం’’అని అమిత్ షా విమర్శించారు. అలాంటి స్థితి నుంచి దేశాన్ని ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా మారుస్తున్న ఘనత నరేంద్రమోదీదేనని చెప్పారు. మోదీకి ఇప్పుడు దేశమంతా అండగా ఉంటోందని, గతంలో బీజేపీ ప్రజాప్రతినిధుల కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు 13 రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉండగా, నాలుగు రాష్ట్రాల్లో పార్టీ భాగస్వామ్యంతో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు సత్వర అభివృద్ధి కోసం తెలంగాణ ఆ జాబితాలో చేరాల్సి ఉందని చెప్పారు.
కొందరికి బీపీ పెరుగుతోంది..
ప్రస్తుతం 11 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని అమిత్ షా చెప్పారు. ‘‘దీన్ని మరింత విస్తరించేందుకు దీన్ దయాళ్ విస్తరణ యోజనతో దేశమంతా పర్యటిస్తున్నాం. 6 లక్షల మంది కార్యకర్తలు అన్ని బూత్‌లలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. నేను పక్షం రోజుల పర్యటనకు బయలుదేరా. ఈ విస్తరణ కార్యక్రమం చూసి కొందరు వ్యతిరేకులకు బీపీ పెరుగుతోంది. కానీ మా కార్యక్రమం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కేవలం పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమమే అని గుర్తించాలి. అనవసరంగా ఆందోళన చెందొద్దు’’అని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత భారీ రాజకీయ పార్టీ విస్తరణ కార్యక్రమం జరగలేదన్నారు. కేవలం మూడేళ్ల కాలంలో 106 వినూత్న పథకాలతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొంటూ ఆయా పథకాల వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయించాలన్న ఉద్దేశంతో కేంద్రం ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రోదసీ చరిత్రలో అమెరికాకు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. ఇదే మార్కు అన్నింటా కనిపించేందుకు మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. ముద్ర బ్యాంకుతో 7.5 కోట్ల మంది యువతకు ఉపాధి ప్రణాళికలు అమలవుతున్నాయని, జన్‌ధన్ బ్యాంకు ఖాతాలతో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు.