123 జీవో ఎందుకు రద్దు చేయలేదు?
- 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలి
- డీపీఆర్ లేకుండా భూసేకరణ
- జూలై 1 నుంచి ముంపు గ్రామాల్లో పాదయాత్ర
- మల్లన్నసాగర్ నిర్వాసితుల సదస్సులో వక్తలు
గజ్వేల్ రూరల్: ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలనుకుంటే 123 జీవోను ఎందుకు రద్దు చేయలేదని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్‌కు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లేకుండా ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.
ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమి ఎంత?, ఏయే గ్రామాల నుంచి ఎన్నిఎకరాలు సేకరిస్తారు? పరిహా రం ఎంత చెల్లిస్తారనేది చెప్పకుండానే 123 జీవో లేదా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామనడం విడ్డూరంగా ఉంద న్నారు. 80 శాతం ప్రజామోదం పొందాకే భూసేకరణ చేపట్టాలని, ఆయా గ్రామాల్లో మార్కెట్ ధర కు నాలుగింతలు పెంచి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ ఎకరాకు రూ.60 వేలు పరిహారం చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో 4-5 లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జూలై 1 నుంచి 4 వరకు ముంపు గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, విమలక్క, ప్రజా సంఘాలు, పార్టీల మద్దతు కోరతామన్నారు.