గద్వాల టౌన్ (మహబూబ్‌నగర్): తాళం వేసి ఉన్న ఇళ్లులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. మార్కెట్ యార్డు రిటైర్డు అధికారి ఇస్మాయిల్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి కర్నూలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు, రూ.5 వేల నగదును అపహరించారు. సమీపంలో ఉండే మార్కెట్ యార్డు కమీషన్ వ్యాపారి మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో చొరబడి రూ.20 వేల నగదు, 5 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
ఆ ఇంటిని ఆనుకొని ఉన్న శంకర్ ఇంటి తాళాలను పగులగొట్టి రూ.3 వేల నగదును మాయం చేశారు. సమీపంలో ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు తిరుమలరావు ఇంట్లో సైతం చొరబడ్డారు. అక్కడ ఎలాంటి నగదు, బంగారం లభించలేదు. ఇస్మాయిల్, తిరుమలరావు ఇళ్లలో గతంలోనే నాలుగైదు సార్లు చోరీలు జరగడం విశేషం. చుట్టుపక్కల వారు బుధవారం విషయాన్ని గ్రహించి బాధితులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.