జగ్గయ్యపేట అర్బన్: హైదరాబాద్ నుంచి విజయవాడలోని షాపునకు బంగారు నగలు డెలివరీ కోసం కారులో నగల వ్యాపారి గుమాస్తాలతో బయలుదేరిన కారు డ్రైవర్ తనకు నిద్ర వస్తుంది టీ తాగుదామని చెప్పి కారు ఆపి టీ తాగుతుండగా, మంచినీటి బాటిల్ కారులో నుంచి తీసుకొస్తానని చెప్పి కారు వద్దకు వెళ్లి బంగారు నగలతో కారులో ఉడాయించిన సంఘటన శనివారం రాత్రి జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాస్ రోడ్డు ఫుడ్‌ప్లాజా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో సూత్రావ్ బాలకిషన్ ఏడేళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో విజయవాడలోని డీఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రైవేటు లిమిటెడ్ షాపు వారికి 7.5 కిలోల బంగారు నగలు ఆర్డర్ ప్రకారం ఇవ్వడానికి ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటలకు కారులో హిమయత్‌నగర్ నుంచి బాలకిషన్, గుమస్తా అంబాదాస్ షిండే, డ్రైవర్ జితేష్ అద్వాల్ బయలుదేరారు. కాగా డ్రైవర్ జితేష్ అద్వాల్ తనకు నిద్ర వస్తుందని చెప్పడంతో జగ్గయ్యపేట సమీపంలోని షేర్‌మహ్మద్‌పేట క్రాస్ రోడ్ ఫుడ్ ఫ్లాజా వద్ద మధ్యాహ్నం 12.30 సమయంలో కారు ఆపారు. ముగ్గురు టీ తాగుతుండగా మంచినీటి బాటిల్ కారులో ఉంది తీసుకొస్తానని చెప్పి కారు డ్రైవర్ జితేష్ అద్వాల్ కారు దగ్గరకు వెళ్లి కారు స్టార్ట్ చేసి విజయవాడ వైపు ఉడాయించాడు. కారుకు జీపీఎస్ ట్రాక్ ఉండటంతో నందిగామ సమీపంలోని మునగచర్ల వద్ద కారును వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి నగల బ్యాగ్‌తో పరారయ్యాడు.
నందిగామ ఏసీపీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేయగా, సంఘటన జగ్గయ్యపేట పట్టణ పరిధిలో జరగడంతో కేసును జగ్గయ్యపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా, పట్టణ ఎస్‌ఐ జి.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా జగ్గయ్యపేట సీఐ లేకపోవడంతో నందిగామ సీఐ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టి కేసు విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment