ఘంటసాల: సామాన్య పౌరుడు నిజాయతీ చూపించాడు. రోడ్డుపై పడి ఉన్న బంగారాన్ని గమనించి సదరు నగలు ఎవరివో ఆరా తీసి అప్పగించాడు. ఈ సంఘటన బుధవారం ఘంటసాలలో జరిగింది. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన గంజి శాంతశ్రీ స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలో గోల్డ్ లోను చెల్లించి రూ.90 వేల విలువైన 13 గ్రాముల బంగారాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బ్యాంక్ పాస్‌బుక్, నగలతో ఉన్న కవర్ పడిపోయింది. కవర్ పడిపోయిన సంగతి చూసుకోని శాంతశ్రీ ఇంటికి వెళ్లిన తర్వాత గమనించి తీవ్ర ఆందోళనకు గురైంది.
కాగా రోడ్డుపై పడి ఉన్న కవరును మల్లాయి చిట్టూరు గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు గమనించగా, బంగారం, ఎస్‌బీఐ పాస్ బుక్ కనిపించాయి. దీంతో సుబ్బారావు బ్యాంకు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ సునీల్ కుమార్‌కు అప్పిగించాడు. వాటిని పరిశీలించిన బ్యాంకు మేనేజర్ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించి శాంతశ్రీకి సమాచారం అందించారు. ఆందోళన చెందుతూ రోడ్డుపై వెతుక్కుంటూ వస్తున్న శాంతశ్రీ బ్యాంకు వారి నుంచి వచ్చిన సమాచారంతో ఊపిరి పీల్చుకుంది. బ్యాంకుకు వచ్చిన శాంతశ్రీకి బీఎం సునీల్ కుమార్ సిబ్బంది సమక్షంలో బంగారం అప్పగించారు. రోడ్డుపై దొరికిన బంగారం నిజాయతీగా తెచ్చి అప్పగించిన సుబ్బారావును బ్యాంకు అధికారులు అభినందించి బహుమతి అందించారు. దొరికిన బంగారం తమకు అప్పగించిన సుబ్బారావుకు శాంతశ్రీ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయతీ
జగ్గయ్యపేట అర్బన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న సుమారు 25 వేల విలువైన బంగారు చెవి దిద్దులు, జుకాలను బస్సులో వెతికి తిరిగి వాటిని ప్రయాణికురాలికి అందజేసిన కండక్టర్ శ్రీదేవిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీరేణుకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రాంతానికి చెందిన ఆరేపల్లి నాగమణి ఈనెల 26వ తేదీ రాత్రి 7.30కు విజయవాడలో ఉన్న బిడ్డ వద్దకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ప్రయాణం మధ్యలో బిడ్డకు చెందిన నగలు చెవి దిద్దులు, జూకాలు ఆమె వద్ద నుంచి జారి సీటు కింద పడిపోయాయి.
ఈ విషయం గమనించని ఆమె విజయవాడలోని భవానీపురం స్టేజి వద్ద దిగి బిడ్డ ఇంటికి వెళ్లి చూసుకుంది. బ్యాగులో ఉన్న నగలు కనిపించకపోవడంతో బస్సులోనే పడిపోయి ఉంటాయని భావించి విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె టికెట్‌ను బట్టి ఆ బస్సు కండక్టర్ వి.శ్రీదేవి అని తెలుసుకొని ఆమెకు చెప్పారు. అప్పటికే బస్సులో ప్రయాణికులు ఎక్కడంతో 3వ సీటు కింద చూడగా ఆభరణాలు ఉన్నాయి. దీంతో కండక్టర్ శ్రీదేవి అధికారుల సమక్షంలో బాధితురాలి భర్త ఆరేపల్లి వెంకటేశ్వర్లుకు వాటిని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment