ఫస్ట్‌ అవర్‌లో హ్యాపీగా జాయిన్‌ కండి... | Good News For The TSRTC Employees For Joining In Duties | Sakshi
Sakshi News home page

డ్యూటీలో చేరండి

Published Fri, Nov 29 2019 2:57 AM | Last Updated on Fri, Nov 29 2019 11:49 AM

Good News For The TSRTC Employees For Joining In Duties - Sakshi

అందరూ శుక్రవారం (నేడు) ఫస్ట్‌ అవర్‌లో హ్యాపీగా జాయిన్‌ కండి. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి ఇప్పుడే లిఖితపూర్వకమైన ఉత్తర్వులు ఇస్తం. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలని కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న.

మీకు ఏ యూనియన్‌ సహాయపడదు. యూనియన్‌ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది.  యాజమాన్యం వేధింపులు భరించాలా? అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా పెడతా.

సమ్మె ప్రక్రియలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడుకుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం.

తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న. గత నాలుగైదేళ్ల నుంచి రూపాయి కూడా చార్జీ పెంచలేదు. కానీ సంస్థ మనది. కార్మికులు మన బిడ్డలు. వారు కూడా బతకాలి. వాళ్లు మనలో భాగమే. కొంత చార్జీల భారం పెంచుతం. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లయితే సంస్థకు ఏటా రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తది. కొంత నష్టాన్ని కూడా పూడుస్తది.

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్నరు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బతీస్తున్నరు. జీవితాలు పాడుచేసుకుంటున్నరు. లేని టెన్షన్‌కు గురవుతున్నరు. ప్రధాన సమస్య అదే. దాని వల్ల ఈ రోజు అసంబద్ధమైన డిమాం డ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు. 

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తుపై బెంగతో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొండంత భరోసా ఇచ్చారు. సమ్మె చేసిన కార్మికులందరినీ ఎలాంటి షరతుల్లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ‘అందరూ శుక్రవారం (నేడు) ఫస్ట్‌ హవర్‌లో హ్యాపీగా జాయిన్‌ కండి. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి ఇప్పుడే లిఖితపూర్వకమైన ఉత్తర్వులు ఇస్తం. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలి కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న’అని సీఎం పేర్కొన్నారు.

‘ఎన్నో సంస్థలను కాపాడినం. ఎంతో మందికి అన్నం పెట్టినం. వీళ్లను (ఆర్టీసీ కార్మికులను) బజార్లో పడేసి మనం జేసేది ఏముంటది? ఒక చాన్స్‌ ఇచ్చి చూద్దాం మనం’’అని మంత్రులందరూ విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఆర్టీసీ అంశంపై కేసీఆర్‌ స్పందన ఆయన మాటల్లోనే...

ఎలాంటి షరతులు పెట్టట్లేదు... 
బాధ్యత గల సీఎంగా, తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని (ఆర్టీసీ కార్మికులను) మా బిడ్డలుగా భావించి రోడ్డున పడేయవద్దని చెబుతున్న. జాయిన్‌ కండి. ఎటువంటి కండిషన్లు మీకు పెట్టం. మీరు ఉద్యోగ భద్రత, యాజమాన్యం నుంచి వేధింపులు లేకుండా రక్షణ కోరుకోవడంలో తప్పులేదు. కానీ క్రమశిక్షణారాహిత్యంతో మేము చెడగొడుతా ఉంటం.. మీరు కాపాడండి అంటే మిమ్నల్ని భగవంతుడూ కాపాడలేడు. మీరు ముందల పడటానికి, సంసారం నడపడానికి ప్రభుత్వం నుంచి రేపు తెల్లారే వరకు ఓ రూ.100 కోట్లు (ఆర్టీసీ తక్షణ అవసరాల కోసం కేబినెట్‌ నిర్ణయం మేరకు రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ గురువారం రాత్రి ఉత్తర్వులిచ్చింది.) ఇస్తం.

కొంత చార్జీలు పెంచుతాం... 
తెలంగాణ ప్రజలకూ విజ్ఞప్తి చేస్తున్న. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వచ్చాక ఒకే ఒకసారి ఆర్టీసీ చార్జీలు పెంచినం. గత నాలుగైదేళ్ల నుంచి రూపాయి కూడా పెంచలేదు. కానీ సంస్థ మనది. కార్మికులు మన బిడ్డలు. వారు కూడా బతకాలి. వాళ్లు మనలో భాగమే. కొంత చార్జీల భారం పెంచుతం. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లయితే సంస్థకు ఏటా రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తది. కొంత నష్టాన్ని పూడుస్తది. చార్జీలు పెంచుకోవడానికి ఎండీకి అధికారమిస్తూ ఇప్పుడే ఆదేశాలిస్తం. ప్రజలు మానసికంగా సిద్ధం కావాలి కాబట్టి వచ్చే సోమవారం నుంచి పెంచిన చార్జీలు వసూలు చేసుకోవచ్చు.

చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు 
సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడుకుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. వారికి ఆడపిల్ల ఉన్నా, అబ్బాయి ఉన్నా ఎవరూ లేక తల్లిదండ్రులు ఉన్నా వారు ఏ రకమైన ఉద్యోగానికి అర్హులైతే ఆ ఉద్యోగాన్ని కల్పిస్తం. మాకు ఆ మానవత్తం ఉంది.

వారికి ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలనుకున్నాం.. 
బస్సులు ప్రైవేటు చేస్తమని మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. వాస్తవానికి మాకు సంపూర్ణ అధికారం ఉంది. ఈ రోజు మేము అనుమతులివ్వొచ్చు. ఏదో కక్షపూరితంగా సాధించే ఉద్దేశాలు, ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పూర్తిగా ఆర్టీసీ లేదు. 35 వేల ప్రైవేటు బస్సులకు అనుమతులిచ్చిర్రు. బీజేపీ పాలించే ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వేలు ఆర్టీసీ బస్సులుంటే 25 వేల ప్రైవేటు బస్సులున్నయి. ప్రైవేటు పర్మిట్లను పెట్టుబడిదారులు, షావుకార్లకు ఇవ్వదలుచుకోలేదు. ఒకవేళ సంస్కరణలు తెచ్చి ఆర్టీసీలో కొద్ది మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకుంటే  నలుగురైదుగురిని కలిపి పర్మిట్లు ఇద్దామనుకున్నం.

యూనియన్లదే పూర్తి బాధ్యత.. 
ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్న రు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బతీస్తున్నరు. జీవితాలు పాడుచేసుకుంటుర్రు.  ప్రధాన సమస్య అదే. దాని వల్ల ఈ రోజు అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు. దీనికి పూర్తి బాధ్యత వారే వహించాలి. ఈ బాధ, అవస్థకు, ప్రయాసకు ఇంకెవరూ బాధ్యత వహించరు.

సీజే ఒక్కరే కన్సర్న్‌ చూపించారు.. 
నిజంగా కార్మికుల గురించి కొద్దిగా సిన్సియర్‌గా ఆలోచన చేసినవారు ఎవరైనా ఉన్నారంటే హైకోర్టు చీఫ్‌ జస్టిసే. నాకు మొన్న రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు. వాళ్లు పేద కార్మికులు, వారిని బతికించే ప్రయత్నం చేయండి అని. ఆయన బెంచి మీద అదే చెప్పిండు. పాపం వీళ్ల బతుకులేమిటి? యూనియన్‌ వాడు ఎవడో.. వీడు ఎవడో కానీ అమాయకులు సస్తున్నరు అని కన్సర్న్‌ చూపించినరు. ఫైనల్‌గా అతి ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన పరిధిలో ఆయన ఆదేశాలిచ్చిండు. అతి చేసింది అంతా యూనియన్‌ నేతలు, ప్రతిపక్షాలే.

ఇక్కడొచ్చి డంకీలు కొడ్తరా? .. 
ఇక్కడున్న ఓ కేంద్ర మంత్రి, నలుగురు బీజేపీ ఎంపీలు మొన్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రవాణాను ప్రైవేటీకరణ చేసే చట్టానికి ఓటేశారు. కానీ ఇక్కడకొచ్చి డంకీలు కొడ్తరా? ఇంత ఆత్మవంచననా? ఇంకా కార్మికులను మభ్యపెడ్తున్నరు. ఢిల్లీ తీసుకెళ్తం. ఎల్లయ్య నుంచి అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తమని. ఢిల్లీ ఎల్లయ్య ఏం చేస్తడు? ఏం ఉంటది వాళ్ల చేతిలో? కేంద్రం వాటా ఉంది అంటున్నారు. కేంద్రం వాటా మాకు ఎంత తేలుతదో లెక్క తీస్తున్నం. కేంద్రం మీద కచ్చితంగా కోర్టుకు వెళ్తం. 1955లో ఏదో రూ. 10 కట్టి పొత్తు కలిశారు తప్ప సమైక్య రాష్ట్రంలో లేదా తెలంగాణలో ఆర్టీసీకి కేంద్రం ఏకాణ ఇచ్చింది లేదు. వాళ్ల 31 శాతం వాటా ప్రకారం ఆడనుంచి ఈడదాకా లెక్కలు తీస్తే రాష్ట్రం పెట్టిన పెట్టుబడులకు కేంద్రం నుంచి రూ. 22 వేల కోట్లు రావాలి.

రేపు నోటీసులిస్తం వారికి. తుపాకీతో కొడ్తమంటే మళ్లీ కనిపిం చరు రిటర్న్‌కల్ల. మేము పైసలు కడ్తం. వీళ్లు కనబడతారు? ఒక ఐదు రూపాయిలు ఇస్తరండి వాళ్లు? రూ. 5 వేల కోట్లు ఇవ్వమంటే ఇస్తరా? శుష్కప్రియాలు శూన్య హస్తాలు, తియ్యపుల్లటి మాటలు, రాజకీయ చలిమంటలు కాసుకోవడం తప్ప ఇవాళ మళ్లీ వస్తరా? కేంద్ర ప్రభుత్వం వస్తదా? ఎవరైతే బీజేపీ నాయకులు జబ్బలుచరుచుకొని మాట్లాడుతున్నరో ఓ 500 కోట్లు తెస్తరా... ఇస్తరా? ఆర్టీసీని కాపాడుతారా? ఇది రాజకీయమా? కార్మికుల బతుకులతో ఆడుకుంటరా?

వారంలో సమావేశమవుతా.. 
వచ్చే నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాల్సి ఉంది. మన ఐఐఎం ఫైల్‌ ప్రాసెస్‌ అయినట్టు తెలిసింది. నేను ఢిల్లీ వెళ్లి వచ్చేలోగా లేదా వెళ్లి వచ్చిన తెల్లారి లేదా వచ్చే వారంలోగా ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిపించి నేనే మాట్లాడతా. ఆర్టీసీలో ఏం జరుగుతోందో నేనే స్వయంగా వారికి చెబుతా. ఆర్టీసీలో నిజమైన పరిస్థితుల గురించి, కాలం చెల్లిన బస్సుల గురించి కార్మికులకు తెలుసా? తెలియదా? యూనియన్ల నషాలోపడి కొట్టుకొపోతున్నరా? నాకు తెలియదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, బస్సుల స్థితి, అప్పులకు సంబంధించి కేబినేట్‌ మీటింగ్‌లో అధికారులు సమర్పించిన పత్రాలను తెలుగులో ముద్రించి మొత్తం 49 వేల మంది కార్మికులకు ఇస్తం.

మీరు చదువుకోండి. వాస్తవాలు తెలుసుకుని మానసికంగా సిద్ధమై మీటింగ్‌కు రండి. ఇక్కడ అందరం కలిసి మంచిగా మాట్లాడి భోజనం చేసి ఒక నిర్ణయం తీసుకుందాం. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా ఆర్టీసీని లాభాల్తో తెస్తం. ప్రతి సింగరేణి కార్మికుడు రూ. లక్షా 60 వేల బోనస్‌ తీసుకున్నరు. ఏటా రూ. 40, 50 వేల బోనస్‌ ఎలా సంపాధించుకోవచ్చో నేనే చూపెడతా. నా మాట వింటే మీరు అలా లాభపడుతారు. ఇంత చెడగొట్టి ఇంత నాశనం చేసిన యూనియన్లను మాత్రం మేము ఈ భేటీకి రానీయం. 10–19 మంది చనిపోవడానికి కారణమైనటువంటి యూనియన్లను క్షమించదలుచుకోలేదు.

ఇద్దరు చొప్పున వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ 
మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా పెడతా. ప్రతి నెలా యథావిధిగా నిర్ణీత తేదీలో సమావేశం జరిగేలా ఏర్పాట్లు చేస్తా. యాజమాన్యం మిమ్మల్ని వేధించకుండా చూస్తా. సంస్థ వేరు, కార్మికులు వేరు అనే అభిప్రాయాన్ని యూనియన్లు కల్పించాయి. సంస్థ మీది. సంస్థ మనుగడలో మీ బతుకు ఉన్నది. సంస్థ మునిగిన తర్వాత మీరు ఎక్కడ ఉంటరు? మీకు ఇది అవగతం కావాలనే కఠినంగా వ్యవహరించా.

ఉన్మాదంలో పడకండి: 20 ఏళ్ల కింద రవాణా మంత్రి గా ఆర్టీసీని రూ. 13.80 కోట్ల నష్టాల నుంచి రూ. 14.50 కోట్ల లాభంలోకి తెచ్చా. ఆర్టీసీకి అది స్వర్ణయుగం. అకస్మాత్తుగా రామారావు అనే యూనియన్‌ నేత 11 రోజుల సమ్మె చేసిండు. తర్వాత ఆయన సమ్మె విరమణకు గౌరవప్రదమైన రిట్రీట్‌ కావాలి అన్నడు. నీ మొఖం కూడా చూడనని అన్నా. మా యూనియన్‌ బతకాలి కదా అందు కే సమ్మె చేసినట్లు తర్వాత నాతో అన్నాడు. సంస్థ బతికి ఉంటే కదా నీ యూనియన్‌ బతికి ఉండేది అన్న. యూనియన్‌ బతకాలన్న ప్రక్రియలో సంస్థను చంపితే ఎలా? ఇప్పుడు కూడా ఇదే ఉన్మాదం. ఉన్మాదంలో పడి మీ బతుకులు పాడు చేసుకోవద్దు. తాత్కాలికంగా పనిచేసిన మిత్రులున్నరో వారికి కృతజ్ఞతలు చెబుతున్న. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ గురించి ఆలోచన చేస్తం.

ఎవరి పొట్టా కొట్టలేదు.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పొట్టలు నింపినం తప్ప ఎవరి పొట్టలూ కొట్టలె. దేశం మొత్తంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న అంగన్‌వాడీ టీచర్లు, హోంగార్డులు, ఆశ వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు మూలవేతనంలో 30 శాతం రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్న, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ప్రధాని ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లో కూడా ఇవ్వడం లేదు.

బజార్లో పడేసింది ప్రతిపక్షాలు, యూనియన్లే
ప్రతిపక్షాలు, యూనియన్‌ నేతలు కార్మికులకు లేని భరోసా కల్పించి బజార్ల పడేశారు. ఇవాళ చివరకు లేబర్‌ కోర్టుకు రెఫర్‌ చేస్తే ఏం ఉందండి? సెక్షన్‌ 22 (1ఏ), 1 (బీ) ప్రకారం ఇప్పటికే కార్మికులు చట్టవ్యతిరేక సమ్మెలో ఉన్నరు. ఇంకా ఏ లేబర్‌ కోర్టు ప్రకటించాల్సిన అవసరం లేదు. మేం తలుచుకుంటే ఒక్క క్షణంలో లేబర్‌ కోర్టుకు రెఫర్‌ చేయగలం. అటోమెటిక్‌గా సమ్మె అక్రమమని డిక్లేర్‌ చేస్తరు. తర్వాత ఏంది? చాలా ఇబ్బంది వస్తది. బతుకులు పోతయి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఏం అవసరముంది? మేము ఆర్టీసీ కార్మికుల పొట్టగొడతామా? వారి ఉద్యోగాలు తీసేస్తమా?

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది: కె. లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, అలాగే పరోక్షంగా నితిన్‌ గడ్కరీ ప్రైవేటీకరణకు ఒప్పుకోకపోవడం వంటి అంశాలు రాష్ట్ర మంత్రి మండలి, ముఖ్యమంత్రిపై ప్రభావం చూపాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ వ్యవహారశైలే కారణమన్నారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడిన అంశాలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా కేంద్రంపై నింద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్టీసీ కార్మికులవి పేద బతుకులని, వారికి అన్యాయం చేయవద్దని ఒక ప్రత్యేక సమావేశంలో అన్నారని, ఈ వ్యాఖ్యలు కేసీఆర్‌ నియంతృత్వానికి నిదర్శనమని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement