సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలోకి మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన గోపాలరెడ్డి వస్తారని అనుకున్నా.. ఆయన ఇప్పుడు రావడం లేదని సమాచారం. 1985 బ్యాచ్‌కు చెందిన గోపాలరెడ్డి ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో (కేంద్ర పాలిత ప్రాంతాలు) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనను కేసీఆర్ తన పేషీలో నియమించుకోవాలని నిర్ణయించి, ఆయనను అక్కడ నుంచి డెప్యుటేషన్‌పై కేటాయించాలని కోరారు.
అయితే గోపాలరెడ్డి కంటే ఒక ఏడాది జూనియర్ అయిన నర్సింగరావు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేస్తున్నందున.. ఆయన దగ్గర పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే గోపాలరెడ్డి రావడానికి ఇప్పుడు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి.