![Government Getting Confused To Give Permission For Industrial Categories - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/3/Lock.jpg.webp?itok=F640cHV6)
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలకు కొన్ని షరతులతో లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటన వెలువడి ఐదు రోజులు కావస్తున్నా మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో పారిశ్రామికవర్గాల్లో అయోమయం నెలకొంది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలు జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పారిశ్రామిక పార్కుల వెలుపల ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు డీఐసీలను సంప్రదిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పరిశ్రమలు నడుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాత పూర్వక అనుమతి ఇచ్చేది లేదని డీఐసీ అధికారులు చెప్తున్నారు.
వాణిజ్య సంస్థలు తెరిస్తేనే!
పరిశ్రమలు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అనుమతి జారీ చేసినా, మరో కోణంలో ఇబ్బందులు తప్పవని పారిశ్రామికవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో రెడ్ జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లోనే ఉండటంతో రవాణా, కార్మికులు, ముడిసరుకుల సమస్య తలెత్తుతుందని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ పరిశ్రమ యజమాని చెప్పారు. పారిశ్రామిక ఉత్ప త్తుల మార్కెటింగ్ అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడంతో, ఉత్పత్తి చేసినా అమ్ముకునే పరిసి ్థతి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే ముడి సరుకులు రావడం, ఫినిషింగ్ గూడ్స్ మార్కెట్‌కు వెళ్లడం సాధ్యమవుతుందని చెప్తున్నారు.
వెళ్లేందుకే వలస కార్మికుల మొగ్గు
లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ పరిశ్రమలను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా కార్మికుల కొరత తలెత్తే అవకాశముందనే ఆందోళన కూడా యాజమాన్యాల్లో కనిపిస్తోంది. తమ సంస్థలో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రయాణానికి అనుమతిస్తే స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్తే మరో రెండు మూడు నెలల పాటు తిరిగి వచ్చే అవకాశం లేదని ఆందోళన వెలిబుచ్చారు.
స్పష్టత కోసం ఎదురుచూపులు
పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాతే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పరిశ్రమలతో పాటు దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే తిరిగి లావాదేవీలు పట్టాలెక్కుతాయని అటు అధికారులు, ఇటు పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభించాలనే యోచనలో మెజారిటీ పరిశ్రమల యాజమాన్యాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment