జ్వరాలకూ ఆరోగ్యశ్రీ: రాజయ్య
పీహెచ్‌సీల్లోనే సాధారణ ఆపరేషన్లు
మన ఆస్పత్రి-మన ప్రణాళిక రూపకల్పనకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జ్వరాలకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య అన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని వ్యాధులను పొందుపరుస్తామన్నారు. ఇకపై చిన్న చిన్న ఆపరేషన్లన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ‘మన ఆస్పత్రి-మన ప్రణాళిక’ పేరిట ప్రతి పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. దీంతో గడప గడపకూ సర్కారీ మందులను అందించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యాంశాలిలా ఉన్నాయి..
త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాదిరిగానే ఎంబీబీఎస్ ఫీజులను ఈ ఏడాది పెంచే ప్రసక్తే లేదు.
నిమ్స్ సహకారంతో ఖమ్మం లేదా కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ. 200 కోట్లు వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరైనా ప్రస్తుతమున్న భవనానికి సాంస్కృతిక వారసత్వ హోదా ఉండటంతో మరమ్మతులకు సాధ్యం కావడం లేదు. చంచల్‌గూడ జైలు స్థలాన్ని ఆస్పత్రి కోసం వినియోగించే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాం.
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మెదడు, గుండె, కిడ్నీ వంటి సూపర్ స్పెషలైజేషన్ శస్త్ర చికిత్సలు మాత్రమే కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటాం. మిగిలిన సాధారణ ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం.
దళితుల సంక్షేమానికి లక్ష కోట్లు....
తెలంగాణ రాష్ట్రంలోనే దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించి వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. వాల్మీకి సమాజ్ ప్రగతి సంఘ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుల్తాన్‌షాయి గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముని వద్ద హనుమంతుడు ఎలా ఉంటాడో... కేసీఆర్‌కు హనుమంతుడిలా వెన్నంటి ఉండి ప్రజల కోసం పని చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ దళితులకు మూడెకరాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం వాటిని అమలు పరిచేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి పనులను ప్రారంభిస్తుందన్నారు.
పీహెచ్‌సీల్లో సెమీ ఆటో అనలైజర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)కు వచ్చే రోగులందరికీ అక్కడే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా పీహెచ్‌సీలకు అవసరమైన పరికరాలను అందించాలని నిర్ణయించింది. తొలుత రక్త పరీక్షలు నిర్వహించే సెమీ ఆటో అనలైజర్లను ప్రతి పీహెచ్‌సీకి అందజేయనుంది. ఒక్కో సెమీ ఆటో అనలైజర్ కొనాలంటే సుమారు రూ.20 వేలు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దాదాపు రూ.3.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని పీహెచ్‌సీలన్నింటికీ వాటిని సమకూర్చాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఏపీఎంఎస్‌ఐడీసీ) సంస్థ పనితీరుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.