నేతన్నలకు ప్రభుత్వం నుంచే ఆర్డర్లు
• స్కూల్, పోలీసు యూనిఫారాలు, ఆసుపత్రులు,
• హాస్టళ్లలో చద్దర్లు వారి నుంచే కొనాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘నేత కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వారు తయారు చేసిన వస్తువుల కు మార్కెటింగ్ కల్పించాలి. వారికి ప్రభుత్వం తరఫునే ఆర్డర్లు ఇయ్యాలి. స్కూల్ పిల్లల యూనిఫారాలు, ఆస్పత్రు లు, హాస్టళ్లలో చద్దర్లు, పండుగలప్పుడు ప్రభుత్వం తరఫున పేదలకు పంచే దుస్తులు, పోలీస్ యూనిఫారాలు తదితర ఆర్డర్లన్నీ చేనేత కార్మికులకివ్వాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారు లకు సూచించారు. పవర్‌లూమ్ పరిశ్రమ లకు కావాల్సినంత పని ఇవ్వాలని, ముడి నూలును సబ్సిడీపై అందించాలని ఆదేశిం చారు. నేత వృత్తిని నమ్ముకున్న వారిని ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొం దించాలని పేర్కొన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో చేనేత, పవర్‌లూమ్ కార్మి కుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు.
ప్రభుత్వ ముఖ్య సలహా దారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, చేనేత, టెక్స్ టైల్ డైరెక్టర్ శైలజారామయ్యర్, సలహాదా రు హెచ్.కె.చారి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివా స్‌రెడ్డి, డీడీ రాంగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రం లో ఒకప్పుడు పెద్దఎత్తున చేనేత కార్మికులు ఈ వృత్తిని నమ్ముకుని జీవించే వారని, కాలక్రమంలో చేనేత వస్త్రాల వాడకం తగ్గడంతో వారి బతుకులు చితికిపోయా యన్నారు. చాలా మంది చేనేత వృత్తి వదులుకున్నారని, మరో పనిచేయలేక కొందరు జీవితం చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది కార్మికులు పవర్‌లూమ్ కార్ఖానాల్లో రోజు కూలీలుగా జీవితం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమా లు రూపొందించాలని ఆదేశించారు.
ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధం
‘‘నేత కార్మికుల బతుకులు దీనంగా ఉన్నాయి. నమ్ముకున్న కుల వృత్తి కడుపు నిండా అన్నం పెట్టడం లేదు. మరో పని చేయలేక వారు కూలీలుగా మారుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి..’’ అని అధికారులకు సూచించారు. ఇప్పటికే నేసి ఉన్న స్టాక్‌ను కొనుగోలు చేయాలని, చేనేత వృత్తిని వదులుకుని ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుందామనుకునే వారికి చేయూతని వ్వాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే కార్య క్రమం సమగ్రంగా ఉండాలని, తమను ప్రభుత్వం బతికిస్తుందనే నమ్మకం వారిలో కలగాలని చెప్పారు. ‘‘నారాయణపేట, గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో కళాత్మకమైన పట్టు వస్త్రాలు నేస్తారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంది.
వాటిని ప్రోత్సహించాలి. అవసరమైన చేయూతనివ్వాలి. ఆ కళ తెలంగాణకు ప్రత్యేకం. దాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్‌లో సిద్దిపేట గొల్లభామ చీరల ను ప్రత్యేకంగా అమ్మేవారు. అలాంటి ప్రత్యే కతలున్న వస్త్రాలకు పూర్వ వైభవం రావా లి. అందుకు అవసరమైన చర్యలు తీసుకో వాలి. నేత వృత్తిని నమ్ముకుని జీవించే వారికి భరోసా ఇవ్వడానికి, ఆదుకోవడానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉంది. పవర్ లూమ్‌లకు కావాల్సినంత సాయం అందిస్తాం. ఈ సాయం కార్మికులకు మేలు చేసేదిగా ఉండాలి’’ అని సూచించారు.