మోర్తాడ్ : గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రవేశపెట్టిన వ్యక్తిగత మరుగుదొడ్డి(ఐహెచ్‌హెచ్‌ఎల్) పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. కొత్తగా మరుగుదొడ్డిని నిర్మించుకోవడానికి అనేక మంది చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. గతంలో మంజూరు చేసిన ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలను మాత్రం పూర్తి చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాన్ని బదలాయింపు చేయడంతో కొత్త మంజూరుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది.
జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 50 వేల మంది మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో మంజూరు అయిన వాటికి మాత్రమే బిల్లులు చెల్లిస్తామని కొత్తగా మంజూరు చేసే ఆంశం తమ పరిధిలో లేదని అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకున్నవారికి ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 4,600లను, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,400లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నాయి. గతంలో జిల్లాలో 1,19,749 మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో 30,604 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి కాగా 22,442 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 66,703 మరుగుదొడ్ల నిర్మాణం మొదలు కావాల్సి ఉంది.
గతంలో మంజూరు పొందని వారు కొత్త మంజూరు కోసం మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఐహెచ్‌హెచ్‌ఎల్‌లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కాగా ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల పథకాన్ని కేంద్రం స్వచ్ఛ భారత్ పరిధిలోకి మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాటికి మంజూరు ఇవ్వలేక పోతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త మంజూరు లేక పోవడంతో ఇప్పుడు వ్యక్తి గత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలనుకునేవారికి నిరాశే ఎదురైతుంది.
కేంద్రం అనుమతి ఇచ్చే వరకు దరఖాస్తు చేసుకున్నవారు ఆగాల్సిందేనని అధికారులు తెలిపారు. స్వచ్చ భారత్ పథకానికి కేంద్రం భారీ ప్రచారం ఇస్తుండగా వ్యక్తిగత మరుగుదొడ్డి పథకానికి అనుమతులను నిలుపుదల చేయడంలో అర్థం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలకు మంజూరు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
‘మరుగు’న పడ్డాయి
Published Sat, Nov 15 2014 4:44 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement