
తాళిబొట్టు చూపుతున్న అర్చకులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు
సాక్షి, యాదాద్రి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం శుక్రవారం యాదాద్రిలో అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం కల్యాణతంతు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన గల బాలాలయంలో ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. విశ్వక్సేన, ఆరాధన పూజలు నిర్వహించిన అనంతరం స్వస్తివాచనం చేసి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. 12.16 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి దంపతులను ఒకచోటుకు చేర్చారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. స్వామివారు కల్యాణోత్సవం సందర్భంగా గజవాహనంపై వచ్చి భక్తులను అనుగ్రహించారు. కల్యాణోత్సవంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ సదారాం, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయిని నరసింహమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఆలయ ఉద్యోగులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాత్రి కొండకింద ఉన్న పాత జెడ్పీ హైస్కూల్‌లో భక్తుల కోసం వైభవోత్సవ కల్యాణం జరిగింది.
ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న గవర్నర్ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment