
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వైద్య విద్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ వైద్య కాలేజీల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. గత ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీని సర్కారు ఏర్పాటు చేసింది. సిద్దిపేటలోనూ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ చివరికి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో సిద్దిపేట కాలేజీలో అడ్మిషన్లు జరిగేలా వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఈ రెండు ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మొత్తంగా వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో కొత్తగా మూడు ప్రభుత్వ వైద్య కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
ప్రభుత్వ కాలేజీలు పెరుగుతుండటంతో పేద కుటుంబాల పిల్లలు ఎక్కువ మందికి వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలుగుతోంది. అన్ని కేటగిరీలు కలిపి తెలంగాణలో ప్రస్తుతం 22 వైద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రభుత్వ కాలేజీలు, ఒకటి ఈఎస్‌ఐ కాలేజీ. మూడు ప్రైవేటు మైనారిటీ కాలేజీలు. 12 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3,200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీలలో కలిపి వెయ్యి ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే మూడు కాలేజీల్లో వచ్చే సీట్లతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడు కాలేజీల్లో సగటున 100 సీట్లకు చొప్పున అనుమతులు వచ్చినా కొత్తగా 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 150 సీట్ల చొప్పున అనుమతి వస్తే కొత్త సీట్ల సంఖ్య 450గా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment