‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం’అన్న నినాదాన్ని నమ్మడం వల్లే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సువైపు మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు ఆర్టీసీలో పెరిగిపోతున్న అద్దె బస్సులడ్రైవర్లు ఈ పరిస్థితిని మార్చేస్తున్నారు. వీరిలో కొందరు అత్యంత నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అన్ని బస్సులూ ఆర్టీసీ బస్సులు కాదనే విషయం తెలియక అవి భద్రమే అనే ధీమాతో ఎక్కేస్తున్నారు. వారికి తెలియని విషయమేంటంటే తాము ప్రయాణిస్తున్న బస్సు బిస్స (స్టీరింగ్) ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్ల చేతుల్లో ఉందని..!
– సాక్షి, హైదరాబాద్
గత్యంతరం లేక..
సరైన పర్యవేక్షణ లేక అస్తవ్యస్తంగా తయారైన ఆర్టీసీలో అధికారులు గత్యంతరం లేక ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి అనుభవం లేని వారికి బస్సులప్పగించేస్తున్నారు. ట్రిప్పులు రద్దు చేయ టమా లేదా ప్రైవేటు డ్రైవర్లకు బస్సు అప్పగించటమా అన్న పరిస్థితిలో వారికి బస్సులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఏ బస్సు ఎక్కడ ఏ ప్రమాదానికి గురవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇటీవల గోదావరిఖని నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వంతెన పైనుంచి 20 అడుగుల లోతుకు పల్టీలు కొట్టింది. వంతెన దాటే సమయంలో డ్రైవర్ గుట్కా ప్యాకెట్ చింపేందుకు యత్నించగా బస్సు అదుపు తప్పిందని ప్రయాణికుల వాదన. మరి నిబంధనలకు విరుద్ధంగా డ్రైవర్ బస్సు నడుపుతూ గుట్కా ఎలా తిన్నాడు? తనిఖీ సిబ్బంది వాసన పసిగట్టడం ద్వారా అతడు గుట్కా తింటున్నాడని గుర్తించే వీలుంటుంది. అయినా డ్రైవర్ ఖాతరు చేయలేదు. తనను తనిఖీ చేయరులే అన్న ధీమానే దానికి కారణం.
ఎందుకీ దుస్థితి..
ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటికేటికీ వివిధ కారణాల వల్ల డ్రైవర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఏడేళ్లుగా వారి నియామకాలు లేకపోవటమే దీనికి కారణం. కొత్త ప్రాంతాలకు బస్సులను నడపాలంటే ఇప్పుడు ఆర్టీసీకి సొంత డ్రైవర్లు లేని పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు నిధుల్లేక చాలాకాలంగా ఆర్టీసీ బస్సులను సమకూర్చుకోలేకపోతోంది. గతంలో ఈ అద్దె బస్సులు మొత్తం బస్సుల సంఖ్యలో 18 శాతానికి మించొద్దన్న నిబంధన ఉండేది. 2015లో నాటి ఎండీ వీటి సంఖ్యను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాటి సంఖ్య ప్రస్తుతం 2,800 వరకు చేరుకుంది.
తక్కువ జీతం..
అద్దె బస్సులు పెరగటం వల్ల ప్రయాణికులకు నేరుగా జరిగే నష్టం లేదు. కానీ వాటికి కనీస శిక్షణ, అనుభవం లేని వారు డ్రైవర్లుగా రావటమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఆర్టీసీ సొంత డ్రైవర్ల సగటు వేతనం రూ.40 వేలు. ఒక బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్లను నియమించాలనేది ఆర్టీసీ నిబంధన. ఒక డ్రైవర్ డ్యూటీ ముగించుకోగానే మరో డ్రైవర్ బస్సు తీసుకోవాల్సి ఉంటుంది. వారి ప్రస్తుత సగటు వేతనం ప్రకారం ఒక బస్సుకు దాదాపు లక్షకు పైగా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అద్దె బస్సులకు చెల్లించే మొత్తంలో డ్రైవర్ వేతనం కేవ లం రూ.13 వేలు మాత్రమే. వాటి నిర్వాహకులు ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను నియమిస్తారు. అంటే 26 వేలు చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ వేతనంతో పని చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదు. మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లు ఎవరూ అద్దె బస్సులు నడిపేందుకు రావ ట్లేదు. దీంతో తక్కువ వేతనం కోసం వచ్చేవారిని నియమించుకుంటున్నారు. ఈ జాబితాలో ఆటో డ్రైవర్లు, లారీల డ్రైవర్లు, లారీల క్లీనర్లు ఎక్కువగా వస్తున్నారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటే చాలట..
బస్సు నడిపేందుకు హెవీ మోటార్ వెహికిల్ లైసెన్సు, ఆర్టీసీ ఆసుపత్రి జారీ చేసే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటే చాలన్నట్లు వారి నియామకానికి అంగీకరిస్తున్నారు. ఈ రెండు సులభంగానే లభిస్తున్నాయి. కానీ కీలకమైన శిక్షణ, అనుభవం మాత్రం వారికి ఉండట్లేదు. అద్దె బస్సు యజమాని సూచించే పేర్లకు అధికారులు టిక్ పెట్టేస్తున్నారు. డ్యూటీలో చేరిన తర్వాత వారిని ఓసారి హకీంపేటలోని జోనల్ డ్రైవింగ్ కళాశాలకు పంపి వాహనం నడిపేతీరును చూసి ఓకే చేసి పంపుతున్నారు. వీరిలో చాలామందికి మద్యం తాగే అలవాటు ఉంటోందని, గుట్కాలు నములుతున్నారని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారని ఫిర్యా దులున్నాయి. సొంత డ్రైవర్లపై నిఘా ఉంచుతున్నట్టుగా అద్దె బస్సు డ్రైవర్లపై ఉండట్లేదు.
వారు తరచూ వేతనం సరిపోవట్లేదంటూ విధులకు రావట్లేదు. దీంతో వాటి యజమానులు సూచించిన జాబితాలోని వేరే డ్రైవర్లను అప్పటికప్పుడు పిలిపించి బస్సు అప్పగిస్తున్నారు. వారి డ్రైవింగ్ తీరుపై అవగాహన లేకున్నా, బస్సు నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో వారికి బస్సు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు పెంచితే మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోతుండటంతో... ప్రమాదాలు జరుగుతున్నా తప్పక అద్దె బస్సులను ఇలాగే నడిపించాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment