కడారి అనంతరెడ్డి, మానేరు విద్యాసంస్థల చైర్మన్,యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పేర్యాల దేవేందర్‌రావు, కిమ్స్, సహజ విద్యాసంస్థల కరస్పాండెంట్, స్వామిగౌడ్, రవీందర్‌సింగ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2019 మార్చిలో జరిగే ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేయాలనుకునే ఆశావహులు నాలుగు జిల్లాల్లో ఓటరు నమోదు కేంద్రాలు, వారి సంఘాలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన స్వామిగౌడ్ శాసన మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాతూరి సుధాకర్‌రెడ్డి మండలి విప్‌గా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చి నెలతో ముగుస్తున్నందునా మండలి పోరుకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు ఓ పక్క నడుస్తుండగానే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదు కార్యక్రమంపై ఆశావహులు దృష్టి సారించారు. ఓటర్ల నమోదు పేరిట కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశావహులు తాము సైతం బరిలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
పట్టభద్రుల కోటాలో పోటాపోటీ.. వివిధ పార్టీల నుంచి ప్రయత్నాలు..
పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్.. మహాకూటమిలతో పాటు బీజేపీ తదితర పార్టీలు సైతం అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో జిల్లా నుంచి కరీంనగర్ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ట్రస్మా రాష్ట్ర ప్రధాన సలహాదారు కడారి అనంతరెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కిమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పేర్యాల దేవేందర్‌రావు తదితరులు పోటీ పడుతున్నారు.
టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంఏ హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తోపాటు మరికొంత మంది హైదరాబాద్ స్థాయిలో వారి వారి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం. కరీంనగర్‌లో ఇన్‌చార్జి డీటీసీగా పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ సైతం అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌తో ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిధిలో ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ సంగారెడ్డి సత్యనారాయణ కూడా కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇదిలా వుంటే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరిగి తానే పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సోమవారం నిజామాబాద్ ఎంపీ కవితను జగిత్యాలలో కలిసినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి కూడా వివిధ పార్టీల నుంచి రోజురోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం..
కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం కింద కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సైతం మళ్లీ బరిలో ఉండి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పీఆర్‌టీయూ సంఘం నుంచి రాష్ట్ర నాయకుడైన పి.రఘోత్తమరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఎస్టీయూ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుజంగరావు తమ అభ్యర్థిగా ఉంటారని ప్రచారం ముమ్మరం చేశారు. యుటీఎఫ్ పక్షాన జాక్టో నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) పక్షాన రాష్ట్ర నాయకులు సీహెచ్ రాములు కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ఓటర్ల నమోదు కార్యక్రమంతో పాటు ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు.
ఓటర్ల నమోదు, ఎన్నికల నిబంధనలు ఇలా..
1 నవంబర్ 2015 వరకు పదవీ విరమణ పొందిన వారు కూడా ఓటరుగా అర్హులు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల నమోదును ఆశావహుల ఇంటింటికీ తిరిగి చేయిస్తున్నారు. నమోదుకు నవంబర్ 5 చివరి తేదీ కావడంతో ముమ్మరం చేశారు. 2012 నుంచి 2018 మధ్యలో మూడు సంవత్సరాల సర్వీసును కూడా లెక్కిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓట్లు తక్కువగా ఉంటాయి. రెండో ప్రాధాన్యత ఇక్కడ కీలకం. ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే పోలైన ఓట్లలో 51 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది.
మొదటి ప్రాధాన్యతలో అభ్యర్థికి 51 శాతం రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత కూడా గెలుపునకు దగ్గరలో లేకుంటే మూడో ప్రాధాన్యతను కూడా లెక్కిస్తారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో రెండో ప్రాధాన్యత ఓటు కూడా అత్యంత కీలకం అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉంటుంది. 2013లో అప్పటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ మద్దతు పలికిన స్వామిగౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పాతూరి సుధాకర్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వస్తుండడంతో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పట్టభద్రులకు ఇవీ నిబంధనలు..
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటు వేసే అర్హులైన ప్రతీ ఒక్కరు ఫారం–18లో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. 31 అక్టోబర్ 2015 లోపు డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులు. ఓటు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. ఫారం–18తో డిగ్రీ మెమో, ప్రొవిజనల్, ఆధార్‌కార్డు జిరాక్స్, కలర్ ఫొటో జతపరిచి సంబంధిత తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment