- విచారణకు ఆదేశించిన కలెక్టర్
- రికార్డులను పరిశీలించిన ఆర్డీవో సుధాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కరువు జిల్లాగా ప్రభుత్వ ప్రకటనకు అవరోధంగా తయారవుతున్న అక్ర మ పత్తి కొనుగోళ్లపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘మహా మోసం’ కథనం జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. దళారుల అక్రమ దందాపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ సీరియస్ అయ్యా రు. ఈ అక్రమంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని సీసీఐ పత్తి రికార్డులను పరిశీలించారు.
రైతుల పేరుతో దళారులు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పరిశీలించారు. రైతుల పేరుతో ఎక్కువ మొత్తంలో పత్తిని సీసీఐకి విక్రయించిన దళారులను వెలికితీసేందుకు మార్కెట్ తక్‌పట్టీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీఐకి విక్రయించిన రైతులు జిల్లాకు చెందిన వారేనా..? కాదా..? అనే కోణంలో వివరాలను సేకరించారు. ఈ మేరకు వారి పేర్లను జైనథ్, తాంసి, తలమడుగు తదితర మండలాల తహశీల్దార్లకు వివరించి విచారణ చేపట్టాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఆదేశించారు.
ఈ మేరకు సంబంధిత వ్యక్తుల వద్ద స్టేట్‌మెంట్లను రికార్డు చేయాలని సంబంధిత తహశీల్దార్లకు ఆర్డీవో ఆదేశించారు. అధికారుల ప్రాథమిక పరిశీలనలో ఆసక్తికరమైన అక్రమాలు వెలుగు చూశాయి. తాంసికి చెందిన ఓ దళారి రైతు పేరుతో సుమారు రూ.3.40 లక్షల విలువ చేసే 86 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు ప్రాథమికంగా తేలింది. అలాగే 12 క్వింటాళ్ల కెపాసిటీ ఉండే ఆటో 28 క్వింటాళ్ల పత్తిని తెచ్చిన దళారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. రైతుల పత్తికి కనీస మద్దతు ధర అందించేందుకు సీసీఐ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఇది దళారులకు వరంగా మారింది. సీసీఐ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 43 లక్షల క్వింటాళ్ల పత్తిలో సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల వరకు దళారులే విక్రయించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి, సీసీఐకి రూ.4,050 చొప్పున సీసీఐకి అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. మహారాష్ట్రతోపాటు, ఇతర జిల్లాలకు చెందిన పత్తి కూడా పెద్ద మొత్తంలో ఈ కేంద్రాలకు అక్రమంగా దిగుమతి అయ్యింది.
ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు కూడా దళారులకు సహకరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎక్కడెక్కడో పండిన పత్తి అంతా ఆదిలాబాద్ జిల్లాలోనే పండినట్లు అధికారిక రికార్డులలో ఎక్కుతోంది. దీంతో కరువు జిల్లా ప్రకటనకు తీవ్ర అవరోధంగా మారనుంది. పత్తి విక్రయించిన రైతులకు సీసీఐ చెక్కుల ద్వారా పత్తి డబ్బులు చెల్లిస్తోంది. ఇలా చెక్కుల ద్వారా కాకుండానే నేరుగా రైతుల ఖాతాలో సొమ్మును జమచేసే విధానాన్ని అమలు చేస్తే 99 శాతం వరకు అక్రమాలకు అడ్డుకట్ట పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానీ అధికారులు కొన్ని సాకులు చూపి ఈ విధానాన్ని అమలు చేయలేదు. దీంతో ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ‘జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాము..’ అని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.