గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది.నామినేషన్ల ఘట్టం చివరి అంకానికి చేరుకోవడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాబితాల్లో చోటు దక్కని వారు చివరి నిమిషంలో గోడ దూకేస్తుండటంతో రాజకీయ సమీకరణలు క్షణానికో రూపు సంతరించుకుంటున్నాయి. మంగళవారం కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితిలో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. - సాక్షి, సిటీబ్యూరో
కాంగ్రెస్‌లో క్యా కమాల్
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కంటోన్మెంట్ టికెట్ ఓయూ విద్యార్థి జేఏసీ నేత క్రిషాంక్‌కు ప్రకటించి.. మర్నాడే ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టడం సంచలనం కలిగించింది. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జేఏసీ నాయకుడు గజ్జెల కాంతానికి టికెట్ కట్టబెట్టారు.
మరోవైపు హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌ని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొలను హన్మంత్‌రెడ్డి ఆ పార్టీకి చేయిచ్చి ‘కారు’ ఎక్కారు. ఆయన కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ పొందారు.
‘కారు’మబ్బులు
చివరి నిమిషంలో చేరికలతో టీఆర్‌ఎస్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులు పలువురు ఆ పార్టీలో చేరిన వెంటనే టికెట్‌లు దక్కించుకున్నారు. ఇది ఆ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో స్థానికేతరులను బరిలోకి దించడంపై పలువురు నాయకులు భగ్గుమంటున్నారు. సొంత బలం లేక ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్న వైనంపై సీనియర్లు అధినేత కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు.సైతం టీఆర్‌ఎస్‌లో చేరడం, టికెట్ పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి.
మైనార్టీలు దూరం..
టీడీపీ.. బీజేపీతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేని హైదరాబాద్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ 17 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 30 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 32 మంది కార్యదర్శులతో సహ మంగళవారం రాజీనామా చేయడంతో మైనార్టీ సెల్ ఖాళీ అయింది. వీరితో పాటు ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దుర్గేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దశరథ్ సైతం రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన జాహెద్‌అలీఖాన్ ఇప్పటికే రాజీనామా చేయడం తెలిసిందే.
అన్నిచోట్లా పోటాపోటీ..
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశించి భంగపడి.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విమర్శించి మరీ బయటకు వెళ్లిన మైనంపల్లి హన్మంతరావు టీఆర్‌ఎస్ తరపున మల్కాజిగిరి లోక్‌సభ బరిలో దిగనున్నారు. ఆయనతోపాటు నలుగురు పార్టీ కార్పొరేటర్లూ దూరమయ్యారు. ఖైరతాబాద్ బీజేపీకి కేటాయించనున్నట్లు సమాచారం ఉండటంతో.. ముందస్తుగా ఆ నియోజకవర్గానికి చెందిన బీఎన్‌రెడ్డి మంగళవారం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.గోషామహల్ నుంచి శీలం సరస్వతి నామినేషన్ దాఖలు చేశారు. ఉప్పల్ అసెంబ్లీ సీటును ఆశించిన దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్‌కు ఆ సీటు దక్కకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. ఆయనకు చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
రేవంత్ హల్‌చల్..
మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని ఆశించిన రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు మంగళవారం చంద్రబాబు ఇంటి వద్ద తీవ్ర గందరగోళం సృష్టించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసి వారు ఆందోళనకు దిగారు.
నామినేషన్ వేస్తానంటూ సిద్ధమైన రేవంత్‌ను కొందరు నేతలు వారించి, శాంతింపచేశారు. మలక్‌పేట బీజేపీకి కేటాయిస్తున్నట్లు తెలిసి ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముజఫర్ అలీ తన అనుచరులతో వీరంగం సృష్టించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి కేటాయించిన స్థానాల్లోనూ బీజేపీ శ్రేణులు టీడీపీకి సహకరించే పరిస్థితి లేదు.
గ్రేటర్ పాలి‘ట్రిక్స్’
Published Tue, Apr 8 2014 11:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement