గ్రూప్-2 యథాతథం
వాయిదా వదంతులను నమ్మవద్దు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ చక్రపాణి
అన్ని పరీక్షలు టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించే యోచన
టీచర్ పోస్టుల భర్తీపై ఇంకా ఇండెంట్ రాలేదని వెల్లడి
ఏఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలు ఆయా శాఖలకు అందజేత
హైదరాబాద్: గ్రూప్-2 రాతపరీక్షలను వచ్చే నెల 24, 25 తేదీల్లో యథాతథంగా నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, అభ్యర్థులందరూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాల (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితాలు)ను ఆయా శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు గురువారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రూప్-2 మినహా నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులన్నింటి భర్తీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని యోచిస్తోందని వెల్లడించారు.
సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదని చెప్పారు. పరీక్షల్లో ఆన్‌లైన్ విధానం తీసుకువచ్చి పారదర్శకతకు, నిష్పక్షపాతానికి పెద్దపీట వేశామని... 2 వేల వరకు సివిల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఇలా చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ సివిల్ ఇంజనీర్ పోస్టుల రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 394.5 మార్కులతో సుంకేపల్లి సాయికిరణ్ టాపర్‌గా నిలిచారని... తరువాత స్థానంలో వరుసగా నడిపల్లి శ్రీధర్, పాలమాకుల అశ్విన్, బండి శిరీష, గుగులోతు బావుసింగ్, రూపావత్ శ్రావంత్ ఉన్నారని చక్రపాణి వెల్లడించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు భవనాల శాఖలో భర్తీకి నోటిఫై చేసిన 931 పోస్టుల్లో 904 పోస్టులను భర్తీ చేశామని.. వారిలో 335 మంది మహిళ లు ఉన్నారని తెలిపారు.