
గల్లంతైన విద్యార్థుల విషయమై పొంగులేటి ఆరా
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలిలో బియాస్ నది ప్రమాదంలో వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి విద్యార్థులు గల్లంతైన సంఘటన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం మంగళవారం సందర్శించింది.
సాక్షి, ఖమ్మం: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలిలో బియాస్ నది ప్రమాదంలో వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి విద్యార్థులు గల్లంతైన సంఘటన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం మంగళవారం సందర్శించింది. ఈ బృందంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. సంఘటన స్థలంతో పాటు, లార్జి డ్యాంను ఆయన సందర్శించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్, పాల్వంచకు చెందిన తల్లాడ ఉపేందర్‌లు ఉండడంతో వారి గురించి ప్రత్యేకంగా ఆయన ఆరా తీశారు.
మండి కలెక్టర్ దేవేష్‌కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొంగులేటి పొల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, అధికారుల చర్యలపై చర్చించారు. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆయన కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో కాకుండా ఆధునాతన పరికరాలతో విద్యార్థుల అచూకీకోసం నదిలో అన్వేషించాలని ఆయన కలెక్టర్‌కు సూచించారు. రెస్క్యూ టీంలను పెంచి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలన్నారు. విద్యార్థుల అచూకీ తెలిసిన వెంటనే తనకు సమాచారం అందించాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను చూసైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. డ్యాం నుంచి వరద నీటిని ఎలాంటి హెచ్చరికలు లేకుండా వదలడం వల్లే ప్రమాదం జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత అక్కడి అధికారులదేనన్నారు. అలాగే ఈ ప్రమాద ఘటనకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. జిల్లా విద్యార్థుల అచూకీ లభ్యమయ్యేవరకు తాను నిత్యం అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతానని వారి తల్లిదండ్రులకు పొంగులేటి భరోసానిచ్చారు.